Thursday, May 2, 2024

ఎపిలో బ‌స్సు, లారీల‌పై ప‌న్ను బాదుడు – ప‌క్క రాష్టాల‌కు పోతామంటున్న య‌జ‌మానులు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను ను ప్రభుత్వం పెంచింది. గతంతో పోల్చితే 25శాతం మేర పన్నులు పెరగనున్నాయి. త్రైమాసిక పన్ను నుంచి వ్యవసాయ వినియోగానికి వాడే ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలను మినహాయింపు ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు, గూడ్స్‌ ఆటోల నుంచి లారీలు, బస్సుల వరకూ త్రైమాసిక పన్నులను పేర్కొంటూ సోమవారం ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. పన్నుల సవరణతో రవాణా రంగానికి పట్టుగొమ్మగా ఉన్న లారీలపై పెద్ద ఎత్తున పడనుంది. సవరించిన పన్నుల ద్వారా ఒక్కొక్క త్రైమాసికానికి రూ.50 నుంచి రూ.75 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అధికార వర్గాల సమాచారం. తద్వారా ఏటా రూ.200 నుంచి రూ.250 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా. రవాణా వాహనాలపై పన్నుల సవరణపై ప్రభుత్వం గత జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసి అభ్యంతరాలు స్వీకరించింది. ప్రభుత్వ పన్ను పెంపుదలను ఏపీ లారీ యజమానుల సంఘం వ్యతి రేకిస్తూ ప్రభుత్వానికి వినతి పత్రం అంద జేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని కొత్త పన్నులను నిర్థారిస్తూ జీవో 31ని జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో రవాణా శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఆదాయం పెంపు నకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపధ్యంలో వాహన పన్ను పెంపుపై కసరత్తు చేసిన రవాణాశాఖ ఎంత శాతం పెంచితే..ఎంత మొత్తం ఆదాయం వస్తుందనే దాని పై సవివరమైన ప్రతిపాద నలను ప్రభుత్వానికి భారీగా పన్నులు పెంచారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,400 కోట్ల మేర కోట్ల ఆదాయం సమకూరింది. ఈ క్రమంలోనే అదనపు ఆదాయం పెంచుకునేలా త్రైమాసికం పన్నును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా వాహనాల్లో లారీలపై భారీగా పన్ను పెరగనుంది.

ఇప్పటి వరకు ఆరు చక్రాల లారీపై మూడు నెలలకు రూ.3,940 పన్ను ఉండగా ఇప్పుడది రూ.1030 పెరిగి రూ.4970 అయ్యింది. పది చక్రాల లారీలకు రూ.6580 నుంచి రూ.8390, 12 చక్రాల లారీలకు రూ.8,520 నుంచి రూ.10,910, 14 టైర్ల లారీకి రూ.10,480 నుంచి రూ.13,430కి పెంచినట్లు రవాణా రంగం నిపుణులు చెపుతున్నారు. బస్సులకు సీట్ల సంఖ్య ఆధారంగా పెంచారు. త్రైమాసిక పన్ను పెంపుదలతో ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల చార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు. 2021 డిసెంబరులో ప్రభుత్వం వాహనాల కొనుగోలుపై పన్నులు పెంచి 39శాతం వరకూ ఆదాయం పెంచుకుంది. ప్రజల సొంత వాహనాలపై ఏడాదికి రూ.403కోట్ల వరకూ అదనపు భారం పడింది. గ్రీన్‌ ట్యాక్స్‌, డీజిల్‌పై సెస్‌ సహా పలు పన్నులు పెంచారు. గతంలో రూ.200గా ఉన్న గ్రీన్‌ టాక్స్‌ను రూ.20వేలకు పెంచారు.

ఇదిలా ఉండగా తమిళనాడు కన్నా మన రాష్ట్రంలో పన్నులు ఇప్పటికే 30శాతం వరకూ పన్నులు ఎక్కువగా ఉన్నాయని, డీజిలు కర్ణాటకతో పోల్చితే 12 రూపాయలు లీటరుపై అధికంగా ఉందని రవాణా రంగం నేతలు పేర్కొంటున్నారు. గతంలో ఇదే అంశంపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా పెంచబోమంటూ హామీ ఇచ్చి మరోసారి పెంచారని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో బస్సుల్లో ప్రయాణించే వారితో పాటు- ట్యాక్సీలు, క్యాబుల్లో ప్రయాణించే వారిపై కూడా మరికొంత భారం పడనుంది. ప్రభుత్వం రకరకాల పన్నుల పెంపుతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న రవాణా రంగంపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందమేనని లారీ యజమానుల సంఘం చెపుతోంది. ఇప్పటికే వివిధ పన్నులు పెంచిన ప్రభుత్వం మరోసారి త్రైమాసిక పన్ను పెంపుతో పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లడమే మేలని వారంటున్నారు. ప్రభుత్వ త్రైమాసిక పన్ను పెంపుపై ప్రధాన భారం లారీలపైనే పడుతుందని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement