Sunday, April 28, 2024

తిరుమల నిర్వాసితులకు గుడ్ న్యూస్‌.. నెరవేర‌నున్న‌ 36 ఏళ్ల కల

తిరుప‌తి స‌మీపంలోని చెర్లోప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధి వెంక‌ట‌ప‌తి న‌గర్ వాసుల‌కు క‌లెక్ట‌ర్ గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నారు. దాదాపు 36 ఏళ్ల నుంచి తీర‌ని క‌ల‌గా మారిన వారి గ్రామ ప‌రిస్థితులు మార‌నున్నాయి. డీకేటీ ప‌ట్టా భూముల నుంచి ఆ ఊరుకు విముక్తి ల‌భించ‌బోతోంది. ఇక మీద‌ట గ్రామ కంఠం భూములుగా ఆ ఊరిని చేర్చ‌బోతుండ‌డంతో గ్రామ‌స్తుల్లో సంతోషం నెల‌కొంది.

తిరుపతి రూరల్, (ప్రభ న్యూస్) : వాళ్లందరూ తిరుమలేశుడి చెంత పుట్టి పెరిగిన వాళ్లు.. శ్రీవారి ఆలయ సమీపంలోనే వారికి నివాస గృహాలుండేవి.. అయితే మూడు దశాబ్దాల క్రితం తిరుమల మాస్టర్ ప్లాన్ తో 750 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. వీరికి తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి పంచాయితీలో 39 ఎకరాల భూమి కొని, నివాస స్థలాలను 1987లో టీటీడీ కేటాయించింది. అక్కడ 750 కుటుంబాలు నివాసం ఏర్పరుచుకోగా వెంకటపతి నగర్ పురుడు పోసుకుంది.

ఇందులో టీటీడీ మిరాశీదార్ల కుటుంబాలు కూడా ఉన్నాయి. 2019 లో చెర్లోపల్లె పంచాయతీ పరిధిలోని వెంకటపతి నగర్ ప్రత్యేక పంచాయతీగా రూపొందింది. అయితే.. ఈ భూములు డీకేటీ కావడంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. ఇళ్ల నిర్మాణం, పిల్లల చదువు, పెళ్లి ఇతర అత్యవసర సందర్భాల్లో స్థలాలను బ్యాంకుల్లో తనాఖా పెట్టడానికి కూడా కుదరలేదు. ఈ విషయమై అనేకసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

తాజాగా వెంకటపతినగర్ సర్పంచ్ చిన్ని యాదవ్ జిల్లా అధికారులతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కలిసి సమస్య విన్నవించారు. డీకేటీ భూమిని గ్రామ కంఠంగా మార్చేందుకు తగిన పత్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి కలెక్టర్ తో చర్చించి సమస్య పరిష్కరించాలని కోరారు. వెంకటపతి నగర్ ను గ్రామకంఠంగా మార్చేందుకు కలెక్టర్ నిర్ణయించారు. దీంతో ఆ గ్రామ‌ వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు కృషి చేసిన సర్పంచ్ చిన్ని యాదవ్ కు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement