Tuesday, May 7, 2024

హాస్టళ్లకు మంచిరోజులు.. వారంలో ప్రారంభం కానున్న నాడు – నేడు పనులు

అమరావతి, ఆంధ్రప్రభ: గబ్బు కొట్టే టాయ్‌లెట్స్‌, రుచి లేని వంటకాలు, కానరాని కనీస వసతలు ఇవి ఇప్పటి వరకు గురుకులాలు, వసతి గృహాల్లో కనిపించిన పరిస్థితులు.. ఇకపై వీటికి చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు – నేడుతో గురుకుల పాఠశాలలు, వసతి గృహాల రూపరేఖలు మారనున్నాయి. మరో వారం రోజుల్లో హాస్టల్స్‌లో నాడు – నేడు పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవలే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, కస్తూర్భా, రెసిడెన్షియల్‌ ఇతర హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు కలిపి 3,929 ఉంటే ఇందులో 5లక్షల 86 వేల,137 మంది విద్యార్ధులు ఉన్నారు.

సకల సదుపాయాలు..

గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ హాస్టళ్ళలో రెండు విడతలుగా నాడు – నేడు పనులు చేపట్టనున్నారు. పారిశుద్ధం, పరిశుభ్రతలపైనా ఇకపై ప్రత్యేక దృష్టిసారించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్టల్‌ విద్యార్థులకు విద్యాకానుకతో పాటు నాణ్యమైన కాస్మోటిక్స్‌ అందించనున్నారు. హాస్టళ్లకు ఇంటర్నెట్‌సదుపాయాన్ని తప్పనిసరి చేస్తున్నారు. వైద్యులు క్రమం తప్పకుండా హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. టాయిలెట్లు-, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, లైట్లు-, తాగునీరు, పెయింటింగ్‌, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్‌ పనులు, సిబ్బందికి, విద్యార్థులకు ఫర్నిచర్‌ కల్పనలో భాగంగా డెస్క్‌లు, బంకర్‌ బెడ్స్‌, స్టడీ టేబుల్స్‌, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్‌, షూ రాక్స్‌, డైనింగ్‌ టేబుల్‌, గార్బేజ్‌ బిన్స్‌, కిచెన్‌ ఆధునీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్‌, గ్యాస్‌ స్టౌవ్స్‌, గ్రైండర్‌, పూరి మేకింగ్‌ మెషీన్‌, ప్రెషర్‌ కుక్కర్‌, ఇడ్లీ కుక్కర్‌, చిమ్నీ, కుకింగ్‌ వెసల్స్‌, డస్ట్‌ బిన్స్‌, 55 ఇంచీల స్మార్ట్‌ టీ-వీతో పాటు- క్రీడాసామాగ్రి, లైబ్రరీ బుక్స్‌ ఏర్పాటు-కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

రోజుకో మెనూ..

అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. అక్షయపాత్ర తరహాలో హాస్టల్‌ విద్యార్థుల కోసం సమీకృత ఆహార వంటశాలలను ఏర్పాటు చేయాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసి అక్కడ నుంచే హాస్టళ్ళకు ఆహారం సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానంలో ఆహారం తక్కువైతే మళ్ళీ తెప్పిస్తారు. మిగిలితే వృథాకాకుండా వెనక్కు తీసుకెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రోజు ఒకే తరహా భోజనంతో ఇబ్బందులు పడ్డ విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఒక మెనూ ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

ప్రత్యేక పర్యవేక్షణ

గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించనుంది. మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ జరుగుతోందో ఆ తరహాలోనే హాస్టళ్ళలో కూడా పర్యవేక్షణ చేయనున్నారు. ఇందుకోసం ఎస్‌ఓపీలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హాస్టళ్ల పర్యవేక్షణకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement