Tuesday, March 28, 2023

ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్రలో భాగంగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు దాదాపుగా 91 రోజుల పాటు జనంలో ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. అదిలాబాద్‌ జిల్లాలో బోథ్‌ నియోజక వర్గం బజరహత్నూర్‌ మండలం పిప్పిరి గ్రామంలో ప్రారంభమై.. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది. 39 అసెంబ్లి నియోజక వర్గాలను టచ్‌ చేస్తూ.. మొత్తం 1,365 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే సీఎల్పీ నాయకుడిగా తెలంగాణ పాదయాత్ర చేయడానికి ముందుకొచ్చినట్లు వివరించారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త తమ శక్తిమేరకు తనతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని భట్టి పిలుపునిచ్చారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

- Advertisement -
   

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నేరవేర్చాలని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పరిపాలనలో ఏ ఒక్క లక్ష్యాన్ని చేరుకోలేదని, దంతో ప్రజలు నిరాశ నిస్ఫృల్లో ఉన్నారని, ఆ ప్రజలకు ధైర్యం ఇచ్చి, అండగా ఉన్నామని చెప్పడానికే తాను పాదయాత్ర చేస్తున్నట్లు భట్టి వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పాదయాత్రలో ప్రజలకు వివరిస్తామన్నారు. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తామన్నారు. దేశంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ కుప్పకూల్చిందని భట్టి మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్నేహితులైన క్రోని క్యాపిటలిస్టులకు ఈ దేశ సంపదను దోచి పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

బీజేపీ నాశనం చేస్తున్న ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర నిర్వహించారని, రాహుల్‌గాంధీ ఇచ్చిన సందేశాన్ని పాదయాత్ర ద్వారా ప్రతి గడపకు తీసుకెళ్లుతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నామ మార్గమని ఇంటింటికి చెబుతామన్నారు. అదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు చేస్తున్న పాదయాత్రలో అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులతో పాటు పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాయ్యం చేసే పర్యవేక్షణ ఏఐసీసీ నిర్వహిస్తుందని భట్టి వివరించారు.

మూడు బహిరంగ సభలు..

పాదయాత్రలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంచిర్యాల, హైదరాబాద్‌ శివారుతో పాటు ఖమ్మంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలకు ఏఐసీసీ నాయకులను తీసుకురావడానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ కార్యదర్శులు కసరత్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమని, ప్రజలకు తెలియజేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి అడుగు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అవసరాలు, ఆశయాలను కాంగ్రెస్‌ ఎజెండాగా మార్చుకుని ముందుకెళ్లుతుందని, పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ కోసం పోరాడిన యోధులు తాను చేసే పాదయాత్రలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

భట్టి పాదయాత్ర కొనసాగే రూట్‌ మ్యాప్‌..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ నెల 16న చేపట్టే పాదయాత్ర ఉమ్మడి అదిలాబాద్‌ బోథ్‌ అసెంబ్లి నియోజక వర్గం నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ఖానాపూర్‌, అసిఫాబాద్‌, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, హుజురాబాద్‌, హుస్నాబాద్‌, వర్దన్నపేట, వరంగల్‌ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగాం, ఆలేరు, భువనగిరి, ఇబ్రాహీపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, చేవేళ్ల, షాద్‌నగర్‌, జడ్చర్ల, నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరెకల్‌, సూర్యాపేట, కోదాడ, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, ఖమ్మం అసెంబ్లి నియోజక వర్గం యాత్ర కొనసాగుతుంది. అక్కడనే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement