Wednesday, November 13, 2024

Floods: సీమ జిల్లాల‌ను కుదిపేసిన వాయుగుండం.. 24కు చేరుకున్న మరణాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు.. ఒకేసారి ఈ రెండు అటాక్ చేయ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాయ‌ల‌సీమ జిల్లాల‌తో పాటు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాలు కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. భారీ వ‌ర్షాలతో వ‌ర‌ద‌లు వ‌చ్చి.. న‌దులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ర‌హ‌దారులు చెరువుల‌య్యాయి. దీంతో రాక‌పోక‌లు స్తంభించిపోయాయి. అంతేకాకుండా ప‌లు గ్రామాలు నీట మున‌గ‌డంతో క‌ట్టుబ‌ట్ట‌ల‌తో బాధితులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లారు. ప‌లు చోట్ల జ‌రిగిన వ‌ర‌ద ప్ర‌మాదాల‌తో ఏపీలో మృతుల సంఖ్య 24కు చేరిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

వరద నీటిలో చిక్కుకున్న బస్సు

ఇంత‌కుముందు ఎప్పుడూ లేని విధంగా రాయలసీమ జిల్లాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో పెను విపత్తు ఏర్పడింది. భారీ వర్షాలకు పెన్నా న‌ప‌ది పాటు ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆనకట్టలు తెగిపోయాయి. గ్రామాల్లోకి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. జలప్రళయంతో గ్రామాలకు గ్రామాల‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ‌ వాయుగుండం తమిళనాడు, ఏపీ సరిహద్దుల్లో తీరం దాటనుందని హెచ్చరించినప్పటి నుంచి అంటే నవంబర్ 17 నుంచే భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతిలో గ‌తంలో ఎప్పుడూ క‌నీ విని ఎరుగ‌ని రీతిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం న‌మోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ.. లోతట్టు ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం 6.33 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టమేర్పడింది. ప్రాణ, ఆస్థి నష్టం భారీగా జ‌రిగింది. ఇప్పటి దాకా భారీ వర్షాల కారణంగా ఏపీలో 24 మంది చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. మరో 17మంది గల్లంతయ్యారు.

చిత్తురు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికీ చాలా గ్రామాలు నీటి ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 21 వందల కిలోమీటర్ల మేర రహదారులు కోతకు గురి కాగా.. 1533 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. వీటి శాశ్వత మరమ్మతుకు దాదాపు 950 కోట్ల రూపాయ‌లు అవసరమని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement