Saturday, September 30, 2023

మళ్లీ వరదలు, పొంగి పొర్లుతున్న నదులు.. అల్పపీడనం ప్రభావంతో మరింత ఉధృతి

అమరావతి, ఆంద్రప్రభ : మళ్లీ వరదలొచ్చాయి.. నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. కృష్ణాలో ప్రధాన జలాశయాలుగా ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లు వరద నీటితో పోటెత్తుతున్నాయి. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్ద్యానికి చేరుకోగా ఎగువ నుంచి గురువారం రాత్రికి 4,12,684 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వచ్చి చేరుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి 4,35,157 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో 215.81 టీ-ఎంసీల నిల్వ సామర్ద్యానికి గాను 213.92 టీ-ఎంసీలను స్థిరంగా ఉంచి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగుల ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి గాను 884.60 అడుగుల వరకు నీరు చేరింది. రానున్న 48 గంటల్లో అల్ప పీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపటంతో శ్రీశైలంకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని బావిస్తున్నారు. ఈ మేరకు వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పాదన కొనసాగిస్తూ నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

సాగర్‌ ఫుల్‌..

- Advertisement -
   

నాగార్జునసాగర్‌ కూడా తీవ్రమైన వరద తాకిడిని ఎదుర్కొంటోంది. సాగర్‌కు ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతి తగ్గుముఖం పడుతున్న క్రమంలో అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీరంతా సాగర్‌కు చేరుకుంటుండగా మరో వైపు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో జలాశయంలో వరద పోటెత్తుతోంది. 312 టీఎంసీల నిల్వ సామర్ద్యానికి గాను 309 టీఎంసీలను స్థిరంగా వచ్చి అదనపు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రికి సాగర్‌లో ఇన్‌ ప్లో 3,57,516 క్యూసెక్కులుగా నమోదు కాగా.. 3,99,016 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పోటెత్తుతున్న పులిచింతల..

వరద నీటితో పులిచింతల పోటెత్తుతోంది. సాగర్‌ నుంచి వచ్చి చేరుతున్న నీటితో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి వచ్చి చేరే ఇన్ ఫ్లో ఈ సీజన్‌లో అత్యధికంగా నమోదయింది. 3,61,379 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా.. ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి 3,73,924 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీపై ఒత్తిడి..

రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌కు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజి వరద ఒత్తిడిని ఎదుర్కొంటుంది. బ్యారేజ్‌లో నీటీ నిల్వ 3.07 టీఎంసీల గరిష్ట సామర్ద్యానికి చేరుకోగా ఎగువ నుంచి 1,93,025 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. అల్పపీడన ప్రభావం మరింత ఎక్కువవుతున్న నేపథ్యంలో రానున్న 48 గంటల్లో బ్యారేజి నుంచి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరవచ్చని అంచనా. ఈ మేరకు ఎక్కడా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా బ్యారేజి నుంచి సముద్రంలోకి నీటిని పంపేందుకు అధికార యంత్రాంగం ఏర్పట్లు చేస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర కూడా పరవళ్ళు తొక్కుతోంది. పుష్కర ఘాట్లు నీట మునగటంతో ముందు జాగ్రత్తగా అక్కడ భక్తులు స్నానాలు చేయటాన్ని నిలిపివేశారు. భక్తులు నది వైపుకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో వైపు వరద నీటితో పెన్నా రిజర్వాయర్లు కూడా పొంగి పొర్లుతున్నాయి. సోమశిలకు భారీగా వరద నీరు వచ్చి చేరటంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం..

కృష్ణాలో వరద ఉధృతి అంతకంతకు పెరిగే అవకాశం ఉండటంతో శ్రీశైలం, సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ పరీవాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు.. ప్రత్యేకించి లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నదుల్లో ఎవరూ స్నానాలకు రావద్దు.. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు.. వరద స్థితిని ఎప్పటికపుడు గమనిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కోరింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని కోరింది. అవసరాన్ని బట్టి ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశముంది. అవసరమైన ప్రాంతాలకు వెళ్ళేలా ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ ఎప్‌ బృందాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement