Sunday, May 5, 2024

Flash.. Flash: తారాజువ్వ పడి తాటాకిల్లు దగ్ధం..

మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం.. మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద తారాజువ్వ పడి ఓ తాటాకిల్లు దగ్దం అయ్యింది. పెద్దకాలువ వంతెన సమీపంలో జ్యోతీరావు ఫూలే విగ్రహం పక్కన ఉన్న ప్రభుత్వం నిర్మించిన గృహాల్లో కుక్కల బుల్లాలు (70) తన ముగ్గురు కుమార్తెలతో జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు పేల్చడంలో ఏదైనా జువ్వ వృద్ధురాలి తాటాకింటిపై పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాన్ని స్థానికులు గుర్తించి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ లో సమాచారం అందించారు. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. తాటాకిల్లు కావడంతో మంటలకు పూర్తిగా దగ్ధం అయింది. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలి బూడిద అయింది. కట్టు బట్టలతో వృద్ధురాలు ముగ్గురు కుమార్తెలతో రోడ్డున పడింది. చూస్తుండగానే ఇల్లు కాలి బూడిద అవడంతో వృద్ధురాలు బుల్లాలు బోరున విలపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement