Wednesday, May 15, 2024

జ‌ల‌శయాల‌లో కాసుల ఆట – నిషేధ స‌మ‌యంలోనూ ఆగ‌ని చేప‌ల వేట ..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, భారీ రిజర్వాయర్లలో దొంగలు పడ్డారు. పట్టపగలే మత్స్య సంపదను దోచుకుంటున్నారు. సంబంధిత అధికారుల కళ్లముందే లక్షల విలువచేసే మత్స్య సంపదను దోచుకుని నిజమైన మత్స్యకారుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆయా జిల్లాలకు చెందిన జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులు అక్రమ చేపల వేట వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం, వారిపై కనీసం కేసులు కూడా నమోదు చేసే దిశగా చర్యలు తీసుకొ కపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లొ నూ అక్రమ చేపల వేట యథేచ్చగా కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో అయితే అధికారులతో మాఫియా చేతులు కలిపి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తుంది. నిత్యం రాష్ట్రం నుండి 50 నుండి 100 టన్నుల వరకూ అక్రమంగా చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి అమ్ముతు న్నారంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో దందా సాగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సి అవసరం లేదు.

జూన్‌, జులై, ఆగస్టు మాసంలో చేప గుడ్డుపెట్టే సమయం. దీంతో అధికారికంగా ఆమూడు నెలలను నిషేధిత సమయంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అందుకోసం మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ప్రత్యేకంగా ఆర్ధిక భరోసాను కూడా కల్పిస్తారు. ఈనేపథ్యంలో మత్స్యకారులు పై మూడు నెలలు చేపల వేటకు దూరంగా ఉంటారు. అయితే ఇదే అదునుగా భావించి కొంత మంది మాఫియా మత్స్యకార వేషం వేసి వివిధ జలాశయాలు, రిజర్వాయర్లలో విచ్చలవిడిగా చేపల వేటను చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయాలు నీరుగారడంతోపాటు విలువైన మత్స్య సంపద దోపిడీ కావడంతోపాటు ఉత్పత్తి కూడా తగ్గే ప్రమాదం కనిపిస్తుంది.

జలాశయాల్లో .. కాసుల ఆట
రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున మత్స్యకారులకు అండగా నిలుస్తుంది. వారికోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా జలాశయాలు, చెరువులు, రిజర్వాయర్లలో నాణ్యమైన చేప పిల్లలను వదిలి మత్స్యకార అభివృద్ధికి పెద్ద పీట వేస్తుంది. అందుకోసం ప్రతి ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంది. ఇటీవల రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో చేప పిల్లలను కూడా వదిలింది. మత్స్యకార శాఖ ప్రత్యేకంగా ఈ ప్రక్రియపై దృష్టి సారించి ప్రతి జిల్లాలోనూ రిజర్వాయర్లు, భారీ మధ్య తరహా నీటి ప్రాజెక్టుల్లోనూ పిల్లలను వదిలారు. రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లను వదిలే కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేపట్టారు. అయితే కొంత మంది మాఫియాగా ఏర్పడి మత్స్యకారులుగా అవతారమెత్తి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్స్య సంపదను దోపిడీ చేస్తున్నారు.
సాధారణ రోజుల్లోనూ మత్స్యకారుల నోట్లో మట్టికొట్టి వారిని దినసరి కూలీలుగా మార్చేస్తున్నారు. చేపల వేటలో వచ్చిన సంపదలో మత్స్యకారులకు పూర్తిస్థాయి వాటా ఇవ్వాల్సిందిపోయి వారికి రోజు కూలీ వంతున రూ. 500 నుండి రూ. వెయ్యి చెల్లించి సందప మొత్తాన్ని మాఫియానే దోచుకుంటుంది. నిషేధ సమయంలో అయితే పూర్తిగా వారే దోచుకుంటున్నారు. మత్స్యకారులతో సంబంధం లేకుండానే సొసైటీ సంఘాలు గుర్తింపు ఇచ్చిన మత్స్యకారులను పక్కనపెట్టి మాఫియా తమ సొంత మనుషులను రంగంలోకి దింపి చేపల వేటను చేపడుతుంది. ప్రధానంగా కృష్ణా నది పరీవాహక ప్రాంతంతోపాటు గోదావరి అలాగే పెన్నా నదిపై నిర్మించిన సోమశిల, కండెలేరు వంటి జలాశయాల్లోనూ నిత్యం చేపల వేటను కొనసాగిస్తున్నారు. గడచిన రెండు నెలలుగా ఇష్టానుసారంగా మత్స్య సంపదను దోచుకుని పొరుగు ఉన్న చెన్నై, బెంగుళూరుకు లారీల్లో తరలించి అమ్మేస్తున్నారు. మరికొన్ని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలో కూడా మర బోట్లతో భారీ వలను విసిరి చేపకు గాలం వేస్తున్నారు.

మత్స్యకారులు విరామం ప్రకటించినా ..
చేపల వేట నిషేధ సమయంలో సముద్రంలో కొంత మంది మత్స్యకారులు చేపల వేటను కొనసాగిస్తుంటారు. సొసైటీ ద్వారా గుర్తింపు పొందిన మత్స్యకారులైతే ప్రభుత్వ ఆదేశాలను అమలుచేస్తూ నిషేధ సమయంలో వేటకు దూరంగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార సొసైటీ సభ్యులు చేపల వేటకు విరామం ప్రకటించినా దళారులు మాత్రం అక్రమంగా చేపల వేటను చేపడుతున్నారు. ఉదాహరణకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో విలువైన మత్స్య సంపద ఉంది. గతంలో జలాశయంలో చేపల వేట సాగించే సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కలువాయి వద్ద నిర్మించిన బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో కూడా కోట్లాది రూపాయల విలువైన చేపలున్నాయి. అయితే గత రెండు నెలలుగా ఆయా ప్రాంతాలకు చెందిన కొంత మంది స్థానిక అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి సంబంధిత అధికారులను తమకు అనుకూలంగా మలుచుకుని చేపల వేటను చేపడుతున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో చేపలను వేటాడే మాఫియా నిషేధ సమయంలో పగటిపూటనే చేపలను పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం చూస్తుంటే మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్ధమౌతుంది. సోమశిల నుండి నిత్యం 5 నుండి 10 టన్నలు చేపలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల పరధిలో ఇదే తరహాలో దోపిడీ కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement