Tuesday, April 30, 2024

ఎపిలో క‌ద‌ల‌ని ఫైళ్లు – మంత్రుల‌కూ తెలియ‌ని ఆదేశాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: మీ వ్యవహారశైలి చూస్తుంటే కోర్టుకే ఏహ్యభావం కలుగుతోంది.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. కొందరు ఉన్నతాధికారుల పని తీరును ఉద్దేశించి సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలివి… ప్రభుత్వశాఖల్లో వేలకొలదీ ఫిర్యాదులు పేరుకుపోతున్నా స్పందన కరవ వుతోందనే విమర్శలు చోటు చేసుకుంటు న్నాయి. కొందరు బ్యూరోక్రాట్ల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కింది స్థాయి వరకు పెండింగ్‌ ఫైళ్లు అటకెక్కుతున్నాయి.. ప్రజా సమస్యలు.. ఫిర్యాదులపై ప్రతి వారం స్వయా న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నా కాగితా ల్లో మాత్రం 80 నుంచి 95 శాతం వరకు పరిష్కారమైందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు అధికార పార్టీ వర్గాల నుంచి సైతం వినవస్తోంది.. మీ వద్దకు ఎవరైనా బాధితులు వస్తే.. వారిని చిరునవ్వుతో పలుకరించి వారి వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని రసీదు ఇవ్వండి.. అంతేకాదు ఆ ఫైలు ఏ దశలో ఉన్నదీ వారికి సమాచారం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రతి సమావేశంలో అధికారులను ఆదేశిస్తున్నారు.. సామాన్యుల సంగతి సరే.. ఏదైనా పని మీద ఎమ్మెల్యేలు.. చివరకు మంత్రులు వచ్చినా స్పందన రావటంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో ఎన్నడూలేని విధంగా హైకోర్టులో ప్రభుత్వపరంగానే 80 శాతం కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. కొందరి నిర్లక్ష్య వైఖరి కారణంగా వివాదరహితంగా నిబద్దతతో వ్యవహరించే అధికారులు సైతం కోర్టు ముందు దోషులుగా నిలబడే దైన్య పరిస్థితి నెలకొంది.. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి కోర్టుకు స్వయంగా హాజరై వివరణ ఇచ్చుకోవటమే ఇందుకు నిదర్శమంటున్నారు.

ముఖ్యమంత్రి సమీక్షల సమయాల్లో మాత్రం అంతా భేషుగ్గా ఉన్నట్లు చూపుతున్నారని క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని స్వయాన ఎమ్మెల్యేలే ఆక్షేపిస్తున్న సందర్భాలు లేకపోలేదు. కొందరు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతోనే అధికారుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయని దీనివల్ల ప్రజల్లో విశ్వసనీయత ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బద్వేల్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న తన సోదరి బదిలీ విషయంలోనే అధికారుల తీరును శంకిస్తూ చివరకు సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తమకు తెలీకుండానే తమ శాఖల నుంచి ఉత్తర్వులెలా జారీ అవుతున్నాయో తెలీటంలేదని పలువురు మంత్రులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది. తన శాఖ పరిధిలో కొందరు కింది స్థాయి అధికారుల బదిలీకి సంబంధించి జీవో చూడటం తప్ప తనకెలాంటి సమాచారంలేదని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరో మంత్రికి కూడా ఇదే చేదు అనుభవం ఎదురయిందని అంటున్నారు. అధికారుల తీరుపై ముఖ్యమంత్రి జగన్‌కు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వం కొద్దినెలల క్రితం ప్రారంభించిన గడప-గడపకు మన ప్రభుత్వం సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోనందునే ప్రజల నుంచి వ్యతిరేకిత ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇందుకు అధికారుల నిర్వాకమే కారణమని పలువురు ఎమ్మెల్యేలు అంతర్మథనం చెందుతున్నారు. ప్రజలకు పాలనా వ్యవస్థను చేరువ చేసేందుకు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది.. క్షేత్రస్థాయిలో వివిధ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక, ఇతర వివరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ పైస్థాయిలో ఫైళ్లలో కదలిక రావటంలేదనే విమర్శలు వస్తున్నాయి.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా తెలుసుకునేందుకు పార్టీపరంగా సచివాలయానికి ఇద్దరు గృహసారథులను కూడా నియమించారు. ప్రభుత్వం అన్నిరకాల స్పందిస్తున్నా కొందరు ఉన్నత స్థాయి అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని ఫైళ్ల వంక కనీసం తలెత్తి చూడటంలేదనేది స్పష్టమవుతోంది..

ఈ ప్రభావం జిల్లా స్థాయి అధికారులపై పడుతోందనే వాదనలు కూడా వినవస్తున్నాయి.. కొందరు ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో మూడు రోజులు, అమరావతిలో రెండు రోజులు మకాంవేసి విధులు నిర్వర్తిస్తున్నారని ఫైళ్లు క్లియరెన్స్‌ కాకపోవటానికి ఇది కూడా మరో కారణంగా చెబుతున్నారు. కాగా ఆర్థికపరమైన అంశాలు, బదిలీల వ్యవహారంలో పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రానందునే వాటిని పెండింగ్‌లో ఉంచుతున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.. ఏతవాత బ్యూరోక్రాట్ల మధ్య చోటుచేసుకున్న ఈ అంతరాలు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయనేది స్పష్టమవుతోంది. గత ప్రభుత్వ హయాంలోనే వేలాదిగా పెండింగ్‌ ఫైళ్లు పేరుకు పోయి పరిష్కారానికి నోచుకోలేదు. దీనివల్లే హైకోర్టు మెట్లెక్కే పరిస్థితులు వస్తున్నాయని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement