Thursday, May 2, 2024

Exclusive – వైసిపి త‌రుపున బ‌రిలో దిగేందుకు ప‌లువురు ఐపిఎస్ లు రెడీ…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: వైఎస్‌ కుటుంబంపై మొద టి నుంచి ఐఏఎస్‌ వర్గాల్లో మంచి అభిప్రాయం కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ పాలనా పరమైన అంశాల్లో వ్యక్తిగతంగా అనేకమంది అధికారులు ఆయనకు సలహాలు ఇచ్చేవారు. ఆ తర్వాత తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనూ తెలుగుదేశం నుంచి రిటైర్‌ ఐఏఎస్‌ అధికారి బి. రామాంజనేయులు పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. మరికొంతమంది కూడా తెలుగుదేశంలో పోటీ చేసే అవకాశం ఇస్తే రంగంలోకి దిగాలని ప్రయత్నాలు కూడా అప్పట్లో చేశారు. తాజాగా వైసీపీ నుంచి కూడా పోటీ చేసేందుకు కొంతమంది రిటైర్‌ ఐఏఎస్‌ లు, సీనియర్‌ అధికారులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి రిటైర్‌ ఐఏఎస్‌ అధికారి వరప్రసాద్‌ గూడురు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన తిరుపతి లోక్‌సభ నుంచి వైసీపీ ఎంపీగా పోటీచేసి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీఎం జగన్‌ గూడూరు అసెంబ్లిd టికెట్‌ను కేటాయించారు. వరుసగా లోక్‌సభ, అసెంబ్లిd ఎన్నికల్లో వరప్రసాద్‌ విజయం సాధించారు.

దీంతో అప్పటి నుంచే కొంతమంది అధికారుల్లో పోటీ చేయాలన్న ఆలోచన, ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఇటీవల రిటైరైన ఐఏఎస్‌లతో పాటు త్వరలో పదవీవిరమణ చేయనున్న మరికొంతమంది అధికారుల చూపు వైసీపీ వైపు పడింది. సీఎం జగన్‌ అవకాశమిస్తే పోటీ చేసేందుకు సిద్ధమన్న సంకేతాలను కూడా వారిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్‌ కుటుంబానికి అత్యంత దగ్గరగా, సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కలెక్టర్‌గా, రాష్ట్రస్థాయిలో కీలకమైన శాఖలకు అధికారిగా వ్యవహరించిన విజయ్‌ కుమార్‌ ఇటీవలె పదవీవిరమణ పొందారు. ఆయన ఇప్పటికే ప్రజల్లో ఉంటూ పాదయాత్ర కూడా చేస్తున్నారు. సీఎం జగన్‌ అవకాశమిస్తే తిరుపతి, బాపట్ల పార్లమెంట్‌ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కరికాల వలవన్‌ పేరు కూడా ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి వచ్చింది. ఆయనతో పాటు ప్రస్తుతం సీఎంవోలో కీలకమైన హోదాలో ఉన్న రాయలసీమ ప్రాంతానికి చెందిన మరో సీనియర్‌ అధికారి కూడా పదవీ విరమణ తర్వాత వైసీపీ నుంచి అవకాశం ఉంటే ఎన్నికల బరిలోకి దిగే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు.

మరికొంతమంది సీనియర్లదీ అదే బాట..
రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ విభాగాల్లో సుదీర్ఘ కాలం పాటు ఆయా ప్రభుత్వాల్లో పనిచేసిన కొంతమంది అధికారులు రాజకీయల పట్ల ఆసక్తి చూపుతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో అనేకమంది మాజీ అధికారులు ఎన్నికల బరిలో నిలిచారు. కొంతమంది పోటీచేసి గెలుపొందగా మరికొంతమంది ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో 2014, 2019 ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీల నుంచి కొంతమంది రిటైర్‌ ఐఏఎస్‌లు పోటీ చేశారు. గత రెండేళ్ల క్రిత తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారిని ఎంపీ అభ్యర్థిగా బరిలో దించారు. ఇలా రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నుంచి మాజీ అధికారులు పోటీచేసి ప్రజాసేవ చేయాలని ఆసక్తి చూపేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు, ముగ్గురు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్‌ కుమార్‌ పేరు బలంగా వినిపిస్తుండగా తాజాగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వలవన్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. 1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన రాష్ట్రంలో కీలకమైన శాఖలకు అధికారిగా వ్యవహరిస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకమైన మున్సిపల్‌ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన త్వరలోనే పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది.

తెరపైకి మరో సీనియర్‌ అధికారి పేరు..
సీఎంవోలో మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేరు కూడా తెరపైకి వస్తోంది. త్వరలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లోపు రిటైర్‌మెంట్‌ అయ్యే అవకాశం లేకపోవడంతో 2029 ఎన్నికల్లో అయినా అవకాశం ఉంటే పోటీ చేయాలన్న యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎంవోలో అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. పదవీ విరమణకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆయన వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఉన్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు మరికొంతమంది అధికారులు కూడా వారి సొంత ప్రాంతాల నుంచి భవిష్యత్‌లో అవకాశముంటే రాజకీయ అరంగేట్రం చేయాలన్న యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

టికెట్లు ఇచ్చే యోచన
2024లో జరిగే సార్వత్రిక ఎన్నిక ల్లో రెండు, మూడు నియోజకవర్గాల్లో రిటైర్‌ ఐఏఎస్‌ అధికారులకు టికెట్లు ఇచ్చే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు చెబుతున్నారు. ఆ దిశగానే ఆయన కొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిటైర్‌ ఐఏఎస్‌ అధికారి గూడూరు ఎమ్మెల్యేగా వరప్రసాద్‌ వైసీపీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన తిరుపతి లోక్‌సభ నుంచి మొదటిసారిగా బరిలోకి దిగారు. 2024 ఎన్నికల్లో ఆయనతోపాటు మరికొంతమంది మాజీ అధికారులకు ప్రాతినిధ్యం కల్పించే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు చెబుతున్నారు. ఆ దిశగానే వారు సామాజిక వర్గాల వారీగా లోక్‌సభ, అసెంబ్లిd స్థానాల్లో వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వైసీపీ నుంచి పోటీ చేయడంతో పాటు అవకాశాలు లేకపోతే పార్టీకి సేవలం దించేందుకు పలువురు మాజీ అధికారులు పోటీపడుతున ్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement