Thursday, May 2, 2024

Big Offer | ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్‌పై ఈవీలు.. ఈఎంఐ ఫెసిలీటీ కూడా

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పబోతోంది. రానున్న రోజుల్లో విద్యుత్‌ స్కూటర్లను డిస్కౌంట్‌తో అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగుల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్న ప్రభుత్వం..తాజాగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బైకులపై సబ్సిడీ భారీగా తగ్గించడంతో డిస్కౌంట్‌ రూపంలో ఉద్యోగులకు వెన్నదన్నుగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తగ్గింపు..మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం జీవిత పన్ను విధించడంతో విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉన్నట్లు గుర్తించింది. దీనిని అధిగమించేందుకు విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసే ఉద్యోగులకు పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

తయారీ సంస్థతో ఒప్పందం..
ఉద్యోగులకు డిస్కౌంట్‌ అందించేందుకు ఏపీ ప్రభుత్వ ఏజెన్సీ నెడ్‌క్యాప్‌ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ అవేరాతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఉద్యోగులకు విద్యుత్‌ వాహనాలపై భారీ డిస్కౌంట్‌ ఇచ్చేందుకు అవేరా సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ ఆంధ్ర పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్‌పై విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లు చేయించేందుకు అవేరా సంస్థతో అవగాహన చేసుకుంది. అవేరా సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ స్కూటర్లలో రెటోరోసా-2 ద్విచక్ర వాహనంపై రూ.10వేలు, లైట్‌ స్కూటర్‌పై రూ.5వేల వరకు డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఈ ఏడాది చివరి నాటికి పెద్ద ఎత్తున ఉద్యోగులు విద్యుత్‌ వాహనాల కొనుగోలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.2,500 వరకు జీతం నుంచి నెలసరి వాయిదా కట్టేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనున్నట్లు చెపుతున్నారు. డిస్కౌంట్‌ సౌకర్యం పొందాలనుకుంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కొనుగోళ్లపై అనాసక్తి..
గతంలో విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లకు వివిధ వర్గాలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క వాహనంపై 40శాతం మేర డిస్కౌంట్‌ ఇవ్వడమే కారణం. 2017లో విద్యుత్‌ వాహనాలపై ఐదేళ్లు సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిన గడవు గత మే 30తో ముగిసింది. ఇకపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీలో 25శాతం తగ్గించి 15శాతానికి కుదించింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం జీవిత పన్నుగా విద్యుత్‌ వాహనాలపై 12శాతం విధించింది. ఓ వైపు కేంద్రం సబ్సిడీ తగ్గింపు, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ పన్ను విధింపుతో విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో విద్యుత్‌ వాహనాలను ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కవగా వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విద్యుత్‌ కొనుగోళ్లపై ఆసక్తి తగ్గిన ఉద్యోగులను డిస్కౌంట్‌ ఆఫర్‌తో ఆకర్షించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

చార్జింగ్‌ సమస్యకు చెక్‌..
విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ సమస్యకు సైతం చెక్‌ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు వాహనదారులే సొంతంగా ఇంటి వద్ద చార్జింగ్‌ పెట్టుకుంటున్నారు వాహన సామర్థ్యం ఆధారంగా చార్జింగ్‌ పెట్టుకొని రాకపోకలు సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్‌ వాహనాల వాడకం పెంచాలంటే పెద్ద ఎత్తున చార్జింగ్‌ పాయింట్లు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. రాష్ట్రంలోని జాతీయ రహదార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో చార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. తద్వారా చార్జింగ్‌ పాయింట్లు అందుబాటులోకి వస్తే విద్యుత్‌ వాహనదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement