Friday, February 23, 2024

Big Story | స్వచ్ఛ నగరాలకు మాస్టర్‌ ప్లాన్‌.. మెట్రోపాలిటన్‌గా అమరావతి

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నగరాలు.. పట్టణాల నవీనీకరణకు పురపాలకశాక కసరత్తు జరుపుతోంది. స్వచ్ఛనగరాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్‌ ప్లాన్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను ప్రజలకు ఆహ్లాదకరాన్ని పంచే విధంగా తీర్చిదిద్దట ంతో పాటు కాలుష్యరహిత నగరాలే లక్ష్యంగా ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోంది.. సేవల రంగ విస్తరణతో జీడీపీ వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థికా భివృద్ధి కూడా సాధ్యపడుతుందని భావిస్తోంది.

నగర, పురపాలక సంఘాల స్వయం సమృద్ధికి సుందరీకరణ.. నవీనీకరణకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో మెట్రోపాలిటన్‌ నగరాల దిశగా అభివృద్ధి పరచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మూడు రాజధానుల నేపథ్యంలో విశాఖ మెట్రోపాలిటన్‌ నగరంలోనే అభివృద్ధిని కేంద్రీకరించారనే విమర్శలకు చెక్‌ పెడుతూ అదే తరహాలో విజయవాడ అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. విజయవాడ అమరావతిని కలుపుతూ మెట్రోపాలిటన్‌ నగరంగా మార్చాలనే ప్రతిపాదన ఉంది.

ఇందుకు విజయవాడ బైపాస్‌ రోడ్డు వారధిగా నిలవనుంది. గన్నవరం పెద్దవుటపల్లి నుంచి గుంటూరు ఎన్నారై మెడికల్‌ కళాశాల వరకు ఏర్పాటుకానున్న ఈ బైపాస్‌లో భాగంగా కృష్ణానదిపై మరో వంతెన నిర్మితమవుతోంది. ఇబ్రహీంపట్నం ఫెర్రి దగ్గర నుంచి తుళ్లూరు మండలం వెంకటపాలెం మీదుగా ఎన్నారై కళాశాల వరకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ వారథికి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తికావచ్చింది. రిటైనింగ్‌ వాల్‌ వెంట నగరవాసులకు ఆహ్లాదాన్ని నింపే వాకింగ్‌ ట్రాక్‌లు, సుందరీకరణ పనులతో పాటు రివర్‌ ఫ్రంట్‌ ప్లాజాఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రధాన నగరాల్లో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఐకనిక్‌ పార్కులు, ఉద్యానవనాల విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. పబ్లి క్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో నవీనీకరణ, సుందరీకరణ పనులు చేపట్టాలని భావిస్తున్నారు. పర్యాటకరంగ అభివృద్ధితో పాటు పట్టణాల్లో మౌలిక వసతులు, సమీప గ్రామాల విలీనంతో అర్బనైజేషన్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం తదితర నగరాల్లో సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విజయవాడ నగరంలో రివర్‌ ఫ్రంట్‌ ప్లాజాలు, రెస్టారెంట్లు, పార్కుల అభివృద్ధితో పాటు విశాఖలో సముద్రతీరాన్ని పర్యాటకంగా మరింత తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ నగరంలో గాంధీ హిల్‌, బరం పార్కులతో పాటు 9 ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటయ్యాయి. తాజా ప్రతిపాదనలతో నగరంలో మరో అద్భుతమైన ఐకానిక్‌ పార్క్‌ కి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శ్రీకారం చుట్టారు. నగర వాసులకు పరిశుభ్రమైన వాతావరణం ఆహ్లాదమైన పరిసరాల్ని ఏర్పాటు- చేయడం లక్ష్యంగా వీఎంసీ అడుగులు వేస్తోంది. ఎంపిక చేసిన నగరాల్లో కుటుంబ వినోదం కోసం అమ్యూజ్‌మెంట్‌ జోన్‌లను నిర్దేశిస్తున్నారు.

ఇందులో భాగంగా విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌లో భారీ మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ డంప్‌ యార్డు చుట్టూ ఉన్న నివాస కాలనీలలో నివసిస్తున్న వేలాది మంది ప్రజల కష్టాలను తీర్చడానికి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఈ స్థలాన్ని ఐకానిక్‌ పబ్లిక్‌ పార్కుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నీ ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ స్వచ్ఛ నగరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో భాగంగా బయో-మైనింగ్‌ ప్రక్రియ ద్వారా సైట్‌ను పునరుద్ధరించడానికి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

గత రెండేళ్లలో విజయవాడ మున్సిపల్‌ అధునాతన పరికరాలను ఉపయోగించి ప్రాసెస్‌ చేయని ఘన వ్యర్థాలన్నింటినీ క్రమబద్ధీకరించడం, నిల్వ చేయడం… చివరకు విక్రయించడం ద్వారా కంపోస్టబుల్‌.. పునర్వినియోగపరచదగిన పదార్థాలను తిరిగి పొందింది…దాదాపు 13.75 ఎకరాల ల్యాండ్‌ ఫిల్‌ ప్లేస్‌లో కొంత భాగం స్థానికంగా పుష్పించే చెట్లు-, పొదలు, పచ్చిక బయళ్లతో పాటు- నేలతోటలతో పర్యావరణ పార్కుగా అభివృద్ధి చేయడానికి… ప్రదర్శన ప్రాంతంలో ఓపెన్‌-ఎయిర్‌ థియేటర్‌ ఉంటు-ంది. ఫుడ్‌ జోన్‌ 3,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతుంది.

జపనీస్‌ గార్డెన్‌ , ఆర్కిడ్‌ గార్డెన్‌, కాక్టస్‌ గార్డెన్‌, ఔషధ మొక్కల తోట మరియు శిల్పాల తోట వంటి విభిన్న ఇతివృత్తాలతో గార్డెన్‌ అభివృద్ధి చేయబడుతుంది . ఏడు జోన్లలో ఎకాలజీ మ్యూజియం కూడా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో నేచురల్‌ హిస్టరీ జోన్‌, హ్యూమన్‌ ఎకాలజీ జోన్‌, సోషల్‌ ఎకాలజీ జోన్‌, కన్జర్వేషన్‌ ఎకాలజీ జోన్‌, కమ్యూనిటీ- హెల్త్‌ జోన్‌, బయోటిక్‌ కాంపోనెంట్స్‌ జోన్‌ మరియు హ్యూమన్‌ సోషల్‌ ఇంటరాక్షన్‌ జోన్‌లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఐకానిక్‌ పార్క్‌ గనక అభివృద్ధి చెందితే పరిశుభ్రమైన, పచ్చని మరియు ఆరోగ్యకరమైన వాతావరణంతో పరిసర అమరావతి ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి..

పార్క్‌ అభివృద్ధి చేయడానికి ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు… ప్రాజెక్టు అంచనా వ్యయం 15 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.. దీనికి సంబంధించిన డిజైన్‌ను విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సోషల్‌ మీడియా లో విడుదల చేసింది.. థీమ్‌ పార్క్‌ డిజైన్‌ కి ప్రజల నుండి స్పందన లభిస్తోంది. మొత్తం 13.75 ఎకరాల స్థలాన్ని 13 జోన్లుగా విభజించారు.పార్క్‌ అన్ని మండలాలు పాదచారుల మార్గాలకు అనుసంధానించబడతాయి.ఇంకా, పార్క్‌లో మూడు వాటర్‌ బాడీలు అలాగే అటవీ నడక అనుభవాన్ని అనుకరించే లక్ష్యంతో రెండు జోన్‌లను అభివృద్ధి చేయనున్నారు.

ఇదిలా ఉండగా రాజమహేంద్ర వరంలోని ప్రాచీన కంబాలచెరువును కూడా ఐకనిక్‌ పార్కుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు వరదల కారణంగా నగరవాసుల జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో చెరువును సుందరీకరణ జరపటంతో పాటు తుపాను, వరద నీటిని నిల్వచేసే దిశగా మాస్టర్‌ ప్లాన్‌కు రూపకల్పన జరిగింది. డ్రెయినేజీ, సీవేజీ, వ్యర్థాల నిర్వహణను చేపట్టటంతో పాటు బండ్‌ సీటింగ్‌, పేవర్స్‌ పాత్‌వే, జాగింగ్‌ఒ ట్రాక్‌, గ్యాలరీ, జెన్‌ గార్డెన్‌, ఎంట్రన్స్‌ ప్లాజా, ప్లే కోర్టు జోన్‌, స్టేట్‌ ప్రైడ్‌ జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

రూ. 10 కోట్లతో రెండు దశలుగా కంబాల చెరువు అభివృద్ధి చేయనున్నారు. పార్కులకు ఎంట్రీ ఫీజుతో పాటు ప్లేకోర్ట్‌ సభ్యత్వం, బర్మా బ్రిడ్జి, లేజర్‌ షో, రెస్టారెంట్ల ద్వారా నగరాల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జాగింగ్‌ ట్రాక్‌ మెంబర్‌ షిప్‌, బోట్‌ సైక్లింగ్‌, రోప్‌వే, 360 డిగ్రీ సైక్లింగ్‌, ఎమ్యూజ్‌మెంట్‌, పిల్లలకు స్కై బెలూన్స్‌, స్కై రోలర్‌, వాటర్‌ వాకింగ్‌ బాల్స్‌, బాడీ జార్బింగ్‌ఒ బాల్స్‌ తదితర ఆరోగ్యకర, పర్యావరణ హితమైన ఎంటర్‌టైన్‌మెంట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి నగరాల స్వరూపాన్ని మార్చే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement