Wednesday, May 1, 2024

Sinhachalam: అంతా నృసింహ మయం… స్వరూపానందేంద్ర స్వామి

ఏ చరిత్ర చూసినా నృసింహస్వామి ప్రస్తావన తప్పకుండా ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. శంకరాచార్యుల వారి అద్వైత గ్రంధాలలోను నృసింహుని గురించి వివరించారని తెలిపారు. ఆరాధనలు అన్నింటా నృసింహస్వామి ఆరాధన గొప్పదని అన్నారు.

తాము కూడా అనుష్టానం సమయంలో నృసింహస్వామి మంత్రాలను తలచుకుంటామని వివరించారు. సింహాచలం కొండపై దేవస్థానం చేపట్టిన సంక్రాంతి సంబరాలను స్వరూపానందేంద్ర స్వామి ఆదివారం ప్రారంభించారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, ఈఓ శ్రీనివాసమూర్తితో కలిసి భోగి మంటల్లో పిడకలు వేశారు. మంత్రోచ్ఛారణల మధ్య సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సింహాచలం వరాహ లక్ష్మీ నర్శింహస్వామిని దర్శించుకున్నారు. నారసింహ క్షేత్రాలు ఎన్ని ఉన్నా వరాహ లక్ష్మీ నర్శింహ స్వామి కొలువుదీరిన సింహాచలం క్షేత్ర ప్రాధాన్యత ప్రత్యేకమని స్పష్టం చేసారు.

ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో అప్పన్నను దర్శించుకోవడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. సంక్రాంతి సంబరాలను భక్తులు దైవ సన్నిధిలో జరుపుకునే విధంగా పండుగ వాతావరణంతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన దేవస్థానం అధికారులను, ధర్మకర్తలను ప్రశంసించారు. విశాఖ శ్రీ శారదాపీఠం తరపున భక్తులకు సంక్రాంతి శుభాశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు వారణాసి దినేష్ రాజ్, గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement