Sunday, April 28, 2024

Count Down: మంత్రుల రాజీనామాకు అంతా రెడీ.. అమాత్యులకు ఇదే చివరి కేబినెట్‌ భేటీ!

అధికార వైకాపాలో రాజకీయం పతాక స్థాయికి చేరుకుంటోంది. మరికొద్ది గంటల్లో రాష్ట్ర కేబినెట్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన భేటీ కాబోతోంది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రుల నుండి రాజీనామాలు కోరనున్నారు. ఇక అలాంటప్పుడు అదే అమాత్యులకు చివరి కేబినెట్‌గా మారనుంది. ఈక్రమంలోనే ప్రస్తుత మంత్రులంతా కాస్త స్థబ్దుగా కనిపిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల్లో మాత్రం నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఎవరివారే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉత్సుకత చూపుతున్నారు.

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో మంత్రుల రాజీనామాలు కోరేందుకు మరో 24 గంటలే సమయం ఉండటంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు- పూర్తికావడంతో సీఎం జగన్‌ ఇక మంత్రివర్గ ప్రక్షాళనపై దృష్టిసారించినట్లు- మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల వ్యాఖ్యలను బట్టి అర్ధమౌతోంది. ఇప్పటికే గత వారంలో మంత్రి కొడాలి నాని మరో వారం పది రోజుల్లో తాను ఫ్రీ అవుతానని, అప్పుడు ఒక్కొక్కరికి సరైన రీతిలో సమాధానం చెబుతానని ఒక సమావేశంలో చెప్పారు.

తాజాగా సోమవారం మరో మంత్రి పేర్ని నాని కూడా ఈనెల 11న కొత్త కేబినెట్‌ కొలువుదీరబోతోందంటూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో జరిగిన సమావేశంలో స్పష్టంచేశారు. దీంతో ఇప్పుడంతా కొత్త మంత్రివర్గంలో ఎవరుంటారు..ఎవరకి ఉద్వాసన పలుకుతారు అన్నదానిపై ఒకవక్క రసవత్తర చర్చ ప్రారంభం కావడంతో మరోపక్క కొత్త మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అనుకున్న విధంగానే ఈ నెల 11న కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ఆయన అధికారులతో పాటు- మంత్రులకూ సంకేతాలు ఇచ్చేశారు. వాటి ప్రకారం వారు కూడా తాము చేయాల్సిన పనులపై క్లారిటీ-తో ముందుకుసాగుతున్నారు.

7వ తేదీన‌ మంత్రుల రాజీనామాలు
ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో దాదాపు 90 శాతం మంత్రులు ప్రక్షాళనలో భాగంగా పదవులు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో అనుకున్న పేర్లకు భిన్నంగా పలు కొత్త సమీకరణాలు తెరపైకి రావడంతో కేబినెట్‌లో ఉంటారని భావించిన వారు కూడా రాజీనామాలకు రంగం సిద్ధం చేసుకుంటు-న్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 7న మంత్రుల మూకుమ్మడి రాజీనామాలకు ఏర్పాట్లు- జరుగుతున్నాయి. ఇందుకోసం వారికి షెడ్యూల్‌ కూడా ఇచ్చేసినట్లు- తెలుస్తోంది.

- Advertisement -

కేబినెట్‌ ముగియగానే రాజీనామా :
ఈ నెల 7న ప్రస్తుత మంత్రులతో సీఎం జగన్‌ కేబినెట్‌ భేటీ- నిర్వహించబోతున్నారు. అందులోనే మంత్రులతో కలిసి జగన్‌ కొన్నికీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత చివరి కేబినెట్‌ భేటీ- అనంతరం మంత్రులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే మంత్రివర్గంలో కొనసాగే, పదవులు కోల్పోయే మంత్రుల పేర్లును వారికి తెలియజేయడంతో పాటు- రాజినామాలు చేయాల్సిన వారి జాబితా కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం సదరు మంత్రులు కేబినెట్‌ భేటీ- ముగిశాక నేరుగా సీఎంకే రాజీనామాలు సమర్పించనున్నారు.

కొత్త కేబినెట్‌ ఏర్పాట్లు- ఇలా..
కేబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన వారంతా తనకు సమర్పించిన రాజీనామాల్ని సీఎం జగన్‌ ఈ నెల 8న గవర్నర్‌ను కలిసి స్వయంగా అందజేయబోతున్నారు. వాటికి ఆమోదముద్ర వేయాల్సిందిగా గవర్నర్‌ను ఆయన కోరతారు. అలాగే కొత్త కేబినెట్‌ ను 11న ఏర్పాటు- చేయబోతున్నట్లు- సీఎం జగన్‌ గవర్నర్‌కు సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం ఈ నెల 11న కొత్త కేబినెట్‌ ప్రమాణస్వీకారం ఉంటు-ంది. ఇందులో కొత్తగా 23 మందికి ఛాన్స్‌ ఇవ్వబోతున్నారు. కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం కూర్పుపై ఇప్పటికే పూర్తయిన కసరత్తు పూర్తయినట్లు- తెలుస్తోంది.

క్యాంపు రాజకీయాల్లో ఆశావహులు
అటు సామాజికవర్గాల సమీకరణాలు, ఇటు జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఆశావహులంతా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఎవరికివారే తమకు అనుకూల వర్గాలను పిలిపించుకోవడం, వారి అంతరంగికులతో సమావేశాలు నిర్వహించడం జరిగిపోతున్నాయి. ఇదే సమయంలో పలు మీడియా సంస్థల ప్రతినిధులకు ఫోన్‌లు చేసి ప్రస్తుత సమాచారం ఏంటంటూ వాకబు చేస్తున్నారు. కేవలం కొద్ది సమయం మాత్రమే ఉండటంతో వారిలో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. గత కేబినెట్‌లో ఉన్న సామాజికవర్గాల సమీకరణాల నేపథ్యంలోనే కొత్త కేబినెట్‌ కూడా రూపుదిద్దుకోబోతుందన్న ఆశావహులు చెబుతున్నారు. అందుకే తమకే ఛాన్స్‌ దక్కే అవకాశముందంటూ ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. మరికొంత మంది తమకున్న పలుకుబడిని ఉపయోగించి సీఎం జగన్‌కు ఢిల్లిd పెద్దలతోనూ ఫోన్‌లు చేయించే ప్రయత్నంలో బిజీబిజీగా ఉండగా మరికొంత మంది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారితో సీఎం జగన్‌కు ఫోన్‌ చేయించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

జగన్‌ ఏదైనా చేయగలరు
ఇక మంత్రివర్గంలో స్థానం కోసం ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. నిన్నమొన్నటి వరకూ జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు వంతున వినిపించిన పేర్లు మంగళవారం నాటికి ఆరుకు చేరుకున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం మంత్రివర్గంలో స్థానం ఆశించేవారి సంఖ్య 55 వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా అధికారికంగా పార్టీ నేతలే చెబుతున్న లెక్కలు. ఇదికాకుండా అనధికారికంగా మరికొంత మంది మదిలో తమకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎవరికైనా మంత్రిపదవి ఇవ్వొచ్చని, అది తమకే ఎందుకు దక్కకూడదంటూ ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌ ఆలోచనలు కొత్తవారికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే విధంగా ఉన్నాయని యువకులు చెబుతుండగా, ఎన్నికలకు వెళ్లే టీం కాబట్టి సీనియర్లకు స్థానం కల్పిస్తారని సీనియర్లు ఆశలు పెట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో మంత్రివర్గంలో పేర్లను ప్రకటించేందుకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. మరి ఆ అదృష్టం ఎవరి వరిస్తుందో అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement