Thursday, May 9, 2024

మొదలైన‌ ఎన్నికల కసరత్తు ..! క్షేత్రస్థాయిలో నేతల పనితీరుపై తెదేపా అధిష్ఠానం కన్ను..

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ ముందస్తు ఆలోచనతో సమగ్ర ప్రణాళికలను రచిస్తూ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తోంది. మహానాడు సక్సెస్‌ జోష్‌ను, ఊపును ఏమాత్రం చేజారనీయకుండా పకడ్భందీ వ్యూహాలు రూపొందించి బలమైన ప్రణాళికతో నేతలను ముందుకు నడిపిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండేలా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూ అవసరమైన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తున్నారు. నిత్యం ఏదోఒక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ముఖ్యనేతల పనితీరుపై అధిష్ఠానం కన్నేసింది. అధికారానికి దూరమై మూడేళ్లు కావొస్తున్నా.. ఇంకా గడపదాటని నేతలకు పరోక్షంగా సంకేతాలను పంపిస్తున్నారు. పార్టీ జయాపజయాలు, బలాబలాలను పక్కకు పెడితే అసలు నియోజకవర్గస్థాయి నేతలు పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు. ప్రజలతో కలిసి నడుస్తున్నారా? అన్న అంశాలపై రహస్య సర్వేలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతల పనితీరు, వారి కదలికలు, గ్రూప్‌ విభేదాలను సేకరించేందుకు ప్రత్యేక టీమ్‌లను అధిష్ఠానం ఏర్పాటు చేసినట్లుగా స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు కార్యక్రమాల నిర్వాహణకు అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాల్లో నేతలు ఎంత వరకు పాల్గొన్నారు, ఎవరెవరు దూరంగా ఉన్నారన్న అంశాలపై సమగ్ర సమాచారాన్ని పార్టీ బృందాలు సేకరించాయి. నియోజకవర్గాలను వదిలి పార్టీ కేంద్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే నేతలకు ఇటీవల ఆ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నియోజకవర్గాల్లో ఉండకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరగడమంటని పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ విభేధాలు రచ్చకెక్కుతున్న నియోజకవర్గాలపై కూడా అధిష్ఠానం సీరియస్‌ దృష్టి పెట్టింది. ఎక్కడైతే విభేధాలు ఉన్నాయో ఆయా నియోజకవర్గాల నేతలతో పాటు పార్లమెంట్‌ ఇంఛార్జ్‌లను పిలిపించి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. రచ్చకెక్కితే చర్యలు తప్పవన్న హెచ్చరికలను జారీ చేయడమే కాకుండా కేడర్‌ను నిరుత్సాహానికి గురిచేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వేటు తప్పదన్న సంకేతాలను కూడా నేరుగా ఇచ్చారు. మరోవైపు నియోజకవర్గాల్లో ఏదో చుట్టపుచూపుగా పర్యటించే నేతలకు కూడా సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటించేంత తీరిక లేకుంటే వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తామన్న హెచ్చరికలు కూడా అధినేత జారీ చేస్తున్నారు. మార్పు రాకుంటే ఎవరిని ఉపేక్షించేది లేదని సమయాన్ని వృధా చేస్తే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటికే తాజాగా జరిగిన సమీక్షలో నెల రోజుల్లో నేతల పనితీరు మారాలని మార్పు రానిపక్షంలో తాను ఏం చేయాలో చూపిస్తానని నేతలకు స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీ కేడర్‌తో పాటు దిగువస్థాయి నేతలతో ముఖ్యనేతల సంబంధాలు ఎలా ఉన్నాయన్న అంశంపై కూడా అధిష్ఠానం ఆరా తీస్తోంది. గతంలోని మూస విధానాలకు స్వస్తి పలికిన తెదేపా అధిష్ఠానం కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తూ నియోజకవర్గాలపై ఒక కన్ను వేసింది. పార్టీ రహస్య బృందాలు సాధారణ వ్యక్తుల్లా గ్రామాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సేకరించిన వివరాలతో సమగ్ర నివేదికలను నేరుగా అధినేత చంద్రబాబుకే ఈ టీమ్‌లు అందిస్తున్నాయి. నేతలతో జరుగుతున్న సమీక్షల్లో సైతం చంద్రబాబు పార్టీ తరుపున చేస్తున్న సర్వేలపై, తనకు అందిన నివేదికలపై కూడా నేతలకు కొన్ని హింట్లు ఇస్తున్నారు. పనితీరు మార్చుకోవాలని సూచిస్తూనే మరోవైపు కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

యువనాయకత్వానికి ప్రోత్సాహం..

తెలుగుదేశం పార్టీ ఒకవైపు సీనియర్లకు తగిన ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయించనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. దీనిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసి ముందుకు సాగుతున్నారు. 2024 ఎన్నికల్లో దాదాపు 60 నుంచి 65 స్థానాల్లో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న యువనేతలకు అవకాశం కల్పించాలన్న ఆలోచనలో తెదేపా అధిష్ఠానం ఉంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేతలకు తగిన ప్రొత్సాహం, గుర్తింపు ఇచ్చేలా చర్యలు మొదలుపెట్టింది. ఒకవైపు పార్టీ బాధ్యతలతో పాటు కీలక పదవులు కూడా ఇవ్వాలన్న నిర్ణయాన్ని అధిష్ఠానం తీసుకుని అమలు చేస్తోంది. తాజాగా పార్టీ యువనేత నారా లోకేష్‌ కొన్ని కీలకవ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడుసార్లు పదవులు పొందిన వారితో పాటు వరుసగా పరాజయాలు పాలైన నేతలకు మరో అవకాశం ఇచ్చే ఆలోచన అధిష్ఠానానికి లేదని తేల్చిచెప్పారు. లోకేష్‌ చేసిన ఈ వ్యాఖ్యలు కొందరు సీనియర్‌ నేతల్లో గుబులును పుట్టించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు అధినేత చంద్రబాబు కూడా వారసత్వ టికెట్లు ఇవ్వడం కుదరదని ఎవరైనా ఎంత సీనియార్టీ ఉన్న వారి వారసులు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమిస్తే వారికి అవకాశం కల్పిస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీ పూర్వవైభవాన్ని తిరిగి సంతరించుకోవాలంటే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు, నియోజకవర్గాలకు దూరంగా ఉండి ఇళ్లకు మాత్రమే పరిమితమైన నేతల అంశంపై కూడా అధిష్టానం గుర్రుగా ఉంది. పార్టీ జోష్‌ పెరుగుతున్న క్రమంలో మళ్లి చేరువ కావాలని ప్రయత్నిస్తున్న నేతల వ్యవహారంపై కొంత సీరియస్‌గానే ఉంది. ఈ అంశాలన్నింటినీ త్వరలో జిల్లాల పర్యటనలో చంద్రబాబు నేతలతో సమీక్షించనున్నారు. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement