Sunday, April 28, 2024

22 పార్టీలకు మమత ఆహ్వానం.. జూన్ 15న ఢిల్లీలో సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ భుజానికెత్తుకున్నారు. ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిస్తూ ఆమె ప్రతిపక్షాలకు లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు సహా మొత్తం 22 మంది పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు తేదీలు ఖరారైన నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమికి సవాలు విసురుతూ ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించేందుకు మమత పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో జూన్ 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మధ్యాహ్నం గం. 3.00కు సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, ఆ సమావేశానికి అందరూ హాజరై చర్చించుకుందామని లేఖల్లో పేర్కొన్నారు. బలమైన ప్రజాస్వామ్య స్వభావం కలిగిన దేశానికి సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరమని, ఈ క్రమంలో దేశంలోని ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దేశాన్ని పీడిస్తున్న విభజన శక్తులను ప్రతిఘటించాలని మమత అన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఆమె తన లేఖలో ఆరోపించారు. దేశంలో అంతర్గతంగా తీవ్ర విభేదాలు సృష్టించి, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను బీజేపీ దెబ్బతీస్తోందని మమత బెనర్జీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రతిఘటనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. సరిగ్గా ఇదే సమయంలో వచ్చిన రాష్ట్రపతి ఎన్నికలు ప్రతిపక్షాలకు భారత రాజకీయ భవిష్యత్తు గమనంపై చర్చించే అవకాశాన్ని కల్పిస్తున్నాయని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంరక్షుడిని, దేశాధినేతను నిర్ణయించడంలో ఈ ఎన్నికలు శాసనసభ్యులకు అవకాశాన్ని కల్పిస్తాయి కాబట్టి, ప్రతిపక్షాల ఐక్యతను చాటి అధికారపక్షాన్ని దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని ఆమె అభిప్రాయపడ్డారు.

దేశంలో ప్రజాస్వామ్యం ఆందోళనకర స్థితిలోకి వెళ్తున్న ఈ సమయంలో ప్రతిపక్షాలు ఏకమవ్వాల్సిన అవసరముందని మమత బెనర్జీ అన్నారు. అణగారిన, ప్రాతినిధ్యం లేని వర్గాల స్వరాన్ని బలంగా వినిపించడానికి, ప్రతిధ్వనించడానికి ఇది చాలా ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా తాను ఏర్పాటుచేసిన సమావేశానికి అందరూ హాజరవ్వాలని ఆమె తన లేఖలో కోరారు.

మమత బెనర్జీ జాబితాలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యమంత్రులు:

  1. అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ సీఎం – ఆప్ అధినేత)
  2. పినరయి విజయన్ (కేరళ సీఎం)
  3. నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం – బీజేడీ అధినేత)
  4. కే. చంద్రశేఖర రావు (తెలంగాణ సీఎం – టీఆర్ఎస్ అధినేత)
  5. ఎం.కే. స్టాలిన్ (తమిళనాడు సీఎం – డీఎంకే అధినేత)
  6. ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర సీఎం – శివసేన అధినేత)
  7. హేమంత్ సోరెన్ (జార్ఖండ్ సీఎం – జేఎంఎం అధినేత)
  8. భగవంత్ సింగ్ మాన్ (పంజాబ్ సీఎం)
  9. సోనియా గాంధీ (కాంగ్రెస్ అధినేత్రి)
  10. లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ అధినేత)
  11. డి. రాజా (సీపీఐ ప్రధాన కార్యదర్శి)
  12. సీతారాం ఏచూరి (సీపీఎం ప్రధాన కార్యదర్శి)
  13. అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ అధినేత)
  14. శరద్ పవార్ (ఎన్సీపీ అధినేత)
  15. జయంత్ చౌధురి (ఆర్ఎల్డీ అధినేత)
  16. హెచ్.డీ. కుమారస్వామి (కర్నాటక మాజీ సీఎం)
  17. హెచ్.డీ. దేవెగౌడ (మాజీ ప్రధాని, జేడీ(ఎస్))
  18. ఫరూఖ్ అబ్దుల్లా (జమ్ముకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత)
  19. మహబూబా ముఫ్తీ (పీడీపీ అధినేత్రి)
  20. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (శిరోమణి అకాలీదళ్ అధినేత)
  21. పవన్ చామ్లింగ్ (సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత)
  22. కే.ఎం. కాదర్ మొహిదీన్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధినేత)

జగన్‌ను, చంద్రబాబును ఎందుకు దూరం పెట్టినట్టు?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఢీకొట్టాలంటే ఆ కూటమిలో లేని అన్ని పక్షాలనూ కలుపుకుపోతే తప్ప విజయం సాధించలేని పరిస్థితుల్లో మమత బెనర్జీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపకపోవడం కొత్త చర్చకు తెరలేపింది. నిజానికి ఏపీ అసెంబ్లీలో 151 మంది సభ్యులతో తిరుగులేని మెజారిటీ వైఎస్సార్సీపీకి ఉంది. అలాగే పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆ పార్టీకి 30 మంది ఎంపీలున్నారు. ప్రతిపక్ష అభ్యర్థి గెలవాలంటే ఈ సంఖ్యాబలం తప్పనిసరి. మమత బెనర్జీ లేఖ రాసినవారిలో దాదాపుగా ఏ పార్టీకీ ఈ స్థాయి సంఖ్యాబలం లేదు. అయినప్పటికీ ఆమె జగన్మోహన్ రెడ్డిని విస్మరించడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు నుంచీ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉందని, ప్రస్తుతం అధికారంలో ఉన్నా సరే కేంద్రంలో అనేక సందర్భాల్లో బీజేపీ ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లులకు మద్ధతిచ్చిందని, ఆ కారణంతోనే మమత వైఎస్సార్సీపీని దూరం పెట్టి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలవడానికి కొద్ది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి మోదీ-షాలతో సమావేశమవడం కూడా ఈ తరహా చర్చకు మరింత బలాన్నిస్తోంది. ఇలాంటప్పుడు పిలిచి భంగపడడం కంటే పిలవకుండా ఉండడమే ఉత్తమమన్న ఉద్దేశంతోనే మమత వైఎస్సార్సీపీకి ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది.

- Advertisement -

ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ముఖ్యనేత చంద్రబాబు నాయుడుకు సైతం మమత నుంచి ఆహ్వానం అందలేదు. ఒకప్పుడు దేశరాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీతో చెలిమి కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన ప్రతిపక్ష కూటమిలో చేరకపోవచ్చని మమత బెనర్జీ భావించినట్టు తెలుస్తోంది. కారణాలేంటన్నది బహిర్గతం కాకపోయినప్పటికీ, ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపకపోవడంపై రాజకీయవర్గాల్లో పలు రకాలుగా చర్చ జరుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement