Wednesday, May 1, 2024

పన్నుల లీకేజీకి ముకుతాడు.. కేరళ తరహా పన్నుల వ్యవస్థపై దృష్టి

అమరావతి, ఆంధ్రప్రభ: ‘దేశంలో అత్యుత్తమ విధానాలు (బెస్ట్‌ ప్రాక్టీసెస్‌) అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పరిశీలించండి. ఎక్కడా పన్నుల లీకేజీ ఉండొద్దు. డీలర్లకు ఇబ్బంది లేనిరీతిలో పన్నుల వ్యవస్థ మెరుగుపరిచి రాబడి పెంచండి’ … అంటూ రాబడి శాఖల సమీక్షా సమావేశబుూల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి తరుచూ అధికారులకు జారీ చేసే ఆదేశాలు. సీఎం ఆదేశాలకనుగుణంగా పన్నుల వ్యవస్థను పటిష్టం చేసి లీకేజీలు లేకుండా మెరుగైన విధానాలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కసరత్తు చేపట్టింది.

ఇప్పటికే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఉన్నతాధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించడంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు. కేరళలో మెరుగైన విధానాలు ఉన్నట్లు గుర్తించారు. కేరళ రాష్ట్రంలో పన్నుల లీకేజీ లేకుండా క్షేత్రస్థాయి నుంచే పటిష్టమైన వ్యవస్థ ఉంది. కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల విభాగంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ ఇంటిలిజెన్స్‌ (డీజీజీఐ) తరహా విధానాన్ని కేరళ ప్రభుత్వం అమలు చేస్తోంది.

అక్కడి విధానాలుగా సమగ్రంగా అమలు చేయాలంటూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను పూర్తిస్థాయిలో పునర్‌ వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. గతంలోనే రెండు సార్లు పునర్‌ వ్యవస్థీకరించగా..తాజాగా ఈ ఏడాది మరోసారి వాణిజ్య పన్నుల శాఖను పునర్‌ వ్యవస్థీకరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి పునర్‌ వ్యవస్థీకరణ సాధ్యం కాదు కాబట్టి మెరుగైన విధానాల్లో కొన్నింటిని తీసుకొని అమలు చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉన్నతాధికారుల స్థాయిలో మరోసారి సమగ్రంగా కసరత్తు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా అమలుకు అవకాశాలు ఉన్నాయి.

కేరళలో అలా..

- Advertisement -


కేరళ రాష్ట్రంలో వాణిజ్య పన్నలు శాఖకు సంబంధించి మూడు జోన్లు ఉన్నాయి. నార్త్‌, సెంట్రల్‌, సౌత్‌ జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్‌కు ఒక సంయుక్త కమిషనర్‌ పర్యవేక్షణలో పటిష్టమైన ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ ఉంటుంది. ఇంటిలిజెన్స్‌ అధికారులు రకరకాల వ్యాపార విధివిధానాలను అధ్యయనం చేస్తుంటారు. వీరికి అనుమానం వచ్చిన వ్యాపార లావాదేవీలుపై క్షేత్రస్థాయిలో ముందుగానే సమగ్ర సమాచారం సేకరిస్తారు. పరిధులతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి అధికారుల దృష్టిలో పెడతారు.

ఆ తర్వాత డీలర్లు, సంస్థలకు నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేస్తారు. అప్పటికే క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు వివరాలు సేకరించడంతో సంబంధిత సంస్థలు, డీలర్లు కూడా విధిలేని స్థితిలో పన్నులు చెల్లించక తప్పదు. ఒకవేళ కాదంటే..అధికారుల వద్ద ఉన్న ఆధారాలు వెల్లడి చేస్తారు. కేరళ రాష్ట్రంలో నలుమూలల ఉన్న సరిహద్దు రహదార్లపై పటిష్టమైన సీసీ కెమెరాల వ్యవస్థ ఉంది.

గూడ్స్‌ వాహనాలను సీసీ కెమెరాలు స్కాన్‌ చేయడంతో పాటు ఆయా వాహనాల పూర్తి వివరాలను నమోదు చేస్తాయి. ఈ-వేబిల్స్‌ ద్వారా సరుకు రవాణాను గుర్తించడంతో పాటు తనిఖీలు చేసి అధికారులు నిర్థారించుకుంటారు. వ్యత్యాసాలు ఉంటే జరిమానాలు విధించడం, సరుకు సీజ్‌ వంటి చర్యలు చేపడతారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 45 స్క్వాడ్‌ బృందాలు నిరంతరం పహారా కాస్తుంటాయి. వీరికి పరుధులతో నిమిత్తం లేకుండా వచ్చిన సమాచారంపై తనిఖీలు చేసే అధికారం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇలా..

ఏపీలో తనిఖీల విధానం కేరళకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్‌ మానిటరింగ్‌ విభాగం సాంకేతికతను ఉపయోగించి పన్నుల్లో వ్యత్యాసాన్ని గుర్తిస్తుంది. వ్యాపార సంస్థలు, డీలర్లు ఫైల్‌ చేసిన రిటర్న్స్‌, చెల్లించిన పన్నులు, ఈ-వేబిల్స్‌ వంటి అన్ని అంశాలను సెంట్రల్‌ మానిటరింగ్‌ సెంటర్‌ పరిశీలిస్తుంది. వ్యత్యాసాలు గుర్తించిన సంస్థల వివరాలను సంబంధిత పరిధిలోని వాణిజ్య పన్నల శాఖ కార్యాలయాలకు సమాచారం ఇస్తారు.

వీటిపై సంబంధిత అధికారులు పరిశీలించి ఆయా సంస్థలు, డీలర్లకు నోటీసులు జారీ చేస్తారు. అంతే తప్ప ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేసే అవకాశం లేదు. వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా తదుపరి చర్యలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీసుకోవాలి తప్ప నేరుగా వెళ్లి తనిఖీలు చేసే అధికారులు ఇక్కడ లేదు. గతంలో జిల్లా స్థాయిలో సంయుక్త కమిషనర్‌ కార్యాలయాలు మాత్రమే ఉండేవి.

ప్రధాన కార్యాలయం నుంచే ఇక్కడి అధికారులకు సమాచారం వచ్చేది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఇటీవల విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి కేంద్రాలుగా మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. గతంతో పోల్చితే ప్రభుత్వం డీలర్లు, సంస్థలకు స్వేచ్ఛాయుత రిటర్న్‌ ఫైలింగ్‌ విధానాన్ని కలిపించింది. సంస్థల రిజిస్ట్రేషన్‌ మొదలు..ఈ వేబిల్స్‌ సహా ఏ ఒక్కరూ వాణిజ్య పన్నలు శాఖ కార్యాలయానికి వచ్చే అవసరం లేదు. అన్నింటిని ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement