Tuesday, April 30, 2024

డీఎస్‌ సీ నోటిఫికేషన్.. టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 502 టీ-చర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ – 2022ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో 199, మోడల్‌ స్కూల్స్‌ లో 207, మున్సిపల్‌ పాఠశాలల్లో 15, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 81..మొత్తం 502 పోస్టులను భర్తీ చేయనున్నట్టు- రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పించారు. ఆన్‌లైన్‌ లో ఫీజు చెల్లించేందుకు ఈనెల 23 బుధవారం నుంచి సెప్టెంబర్‌ 17 వరకు గడువు ఇచ్చారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబరు 18 లోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌ లోనే అప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 6 నుంచి హాల్‌ టికెట్లను సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 23న పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 4న డిస్ట్రిక్ట్ర్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్‌ సీ) ద్వారా ఫలితాలు వెల్లడించనున్నారు.

తుది ఫలితాలు వెల్లడించనున్న నవంబరు 4కు ముందు అక్టోబరు 28న పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి అక్టోబరు 31 వరకు విడుదల చేసిన కీపై అభ్యంతరాలను కూడా స్వీకరించనున్నారు. ఆ తరువాత నవంబరు 2న ఫైనల్‌ కీ విడుదల చేసి నవంబరు 4న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నోటిపికేషన్‌ ద్వారా స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్స్‌), ఏపీ మోడల్‌ స్కూల్స్‌ పీజీటీ, టీజీటీ, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకించి స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న 81 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 7, విశాఖపట్టణంలో 6, తూర్పుగోదావరిలో 6, పశ్చిమ గోదావరిలో 6, కృష్ణాలో 7, గుంటూరులో 6, ప్రకాశంలో 6, నెల్లూరులో 9, కడపలో 7, చిత్తూరులో 5, అనంతపురంలో 10, కర్నూలులో 2 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement