Thursday, May 9, 2024

డాక్టర్ మినిష్ట‌ర్‌: ముగ్గురికి అత్యవసర వైద్యం చేసిన అప్ప‌ల‌రాజు.. త‌ల్లి బిడ్డ‌ల‌కు ప్రాణ‌భిక్ష‌

పలాస. ప్రభ న్యూస్‌ : వైద్య వృత్తిలో ఆరితేరిన మంత్రి డాక్టర్‌ సీధిరి అప్పలరాజు కొంత సేపు అధికార దర్పం పక్కనపెట్టి మెడలో స్టేతస్కోప్‌ ధరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒ కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టారు. ఆ కుటుంబంతో పాటు, గ్రామస్థులంతా మంత్రి సీధిరికి కృతజ్ఞతలు తెలిపారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఒక మహిళ మనస్థాపానికి గురై తన పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను కూడా విషం తాగింది. వీరు ముగ్గురు అపస్మారక స్థితిలోకి చేరడంతో కుటుంబ సభ్యులు వెంకటనే పలాసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు.

తాను వచ్చేలోగా ప్రాథమిక చికిత్స అందించాలని సూచించారు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మెడలో స్టెతస్కోప్‌ ధరించి చికిత్స చేసేందుకు ఉపక్రమించారు. ఈ మేరకు పిల్లలను తల్లిని ప్రాణాపాయ స్థితి నుండి రక్షించారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డామని, మా ప్రాణాలు కాపాడి మాపాలిట దేవుడిగా నిలిచారని మంత్రి అప్పలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, తోటి వారి సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని గాని ఆత్మహత్యకు పాల్పడకూడదని హితబోధ చేశారు. ఐదు సంవత్సరాలుగా వైద్య వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, రాష్ట్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ప్రజాల కోసం మళ్లీ స్టెతస్కోపు ధరించడం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. బాధిత కుటుం బ సభ్యులతో పాటు బొడ్డపాడు గ్రామస్తులంతా మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement