Tuesday, April 30, 2024

చుక్క‌ల చిక్కు వీడింది.. నేడు భూమి హ‌క్కు ప‌ట్టాలు పంపిణీ చేయ‌నున్న జ‌గ‌న్

అమరావతి, ఆంధ్రప్రభ, బ్యూరో: రైతు సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడూ ముందుంటానని మరోసారి రుజువు చేసుకున్నారు. అన్నదాతల కన్నీళ్లు తుడవడంలోనూ, వారి సమస్యలను పరిష్కరించడం లోనూ సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు చొరవ చూపుతూ వస్తున్నారు. ఫలితంగానే దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యకు పరిష్కారాన్ని చూపి కోట్లాది రూపాయలు విలువైన భూములను రైతులకు హక్కుదారులుగా అందించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటు-ంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వేదికగా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. బ్రిటీ-ష్‌ కాలం నాటి నుండి సుమారు వంద సంవత్సరాల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి’ లేదా ‘ప్రైవేటు- భూమి’ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు’ పెట్టి వదిలేశారు. సదరు భూములే ‘చుక్కల భూములు’.. దీని వల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతూ వస్తున్నారు. దీనికి అదనంగా రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో వీరికి పూర్తిగా అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. అధికారుల అనాలోచిత చర్యల వల్ల ఈ భూములన్నీ ఒక్క కలం పోటు-తో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటిపై సీఎం జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ సమస్యను పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చుక్కల భూముల సమస్యల నుంచి కొంతమంది రైతులకు విముక్తి లభించబోతోంది.

ఇక రైతులే..సంపూర్ణ హక్కుదారులు
చుక్కల భూముల సమస్యను పరిష్కరించడంతో పాటు గతంలో హక్కుదారులుగా ఉన్న రైతులకే ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ దిశగా రికార్డులను సిద్ధం చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు హక్కు పత్రాలు అందించబోతున్నారు. ప్రతి రైతన్న కుటు-ంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా హక్కు పత్రాలు అందించబోతున్నారు. అలాగే వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు వైఎస్‌ జగన్‌ పరిష్కారం చూపించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 22,000 మంది పేద రైతన్నలకు మేలు జరిగేలా నిషేధిత భూముల జాబితా నుండి సుమారు 35,000 ఎకరాల ”షరతులు గల పట్టా భూములను తొలగించారు. దేశంలోనే మొదటి సారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వందేళ్ల తర్వాత చేపట్టిన ”వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష’ ద్వారా ఇప్పటివరకు 2000 గ్రామాల్లో 7,92,238 కి పైగా భూహక్కు పత్రాలు రైతులకు అందజేశారు. అలాగే భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కరించాలనే దృక్పథంతో డిసెంబర్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో 17,584 గ్రామాలు, పట్టణాల్లో భూముల రీసర్వే. పూర్తి చేసి శాశ్వత భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఇప్పటికే దాదాపు 1,27,313 మంది గిరిజనులకు సుమారు 2.83 లక్షల ఎకరాల అటవీ హక్కుపత్రాల పంపిణీ చేశారు.

చొరవ చూపితే..మరి కొంతమంది రైతులకు న్యాయం జరిగే అవకాశం
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తూ వస్తోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాల భూములను ఆ జాబితా నుంచి తొలగించి రైతులక పట్టం కట్టబోతుంది. అయితే ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో సుమారు 6 లక్షల ఎకరాలకు పై గా భూ సమస్యలతో రైతులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిలో 2 లక్షల ఎకరాలకు పైగా ఇప్పటివరకు పరిష్కారం లభించింది. సీఎం జగన్‌ మరింత చొరవ చూపితే మిగిలిన భూ సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో తహసీల్దార్లు తమకు అనుకూలంగా వ్యవహరించని రైతులకు సంబంధించిన భూముల విషయంలో ఉన్నతాధికారులు సైతం తప్పుడు నివేదికలు సమర్పిస్తూ రైతులకు చుక్కల సమస్యలతో మరెన్ని చుక్కలు చూపిస్తున్నారు. అటువంటి భూములపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement