Tuesday, April 30, 2024

ఆర్థిక సంఘం నిధులు మళ్లింపు .. రూ.27.82కోట్లు సర్దుబాటు..

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలోని పురపాలక సంఘాల్లో 14, 15 ఆర్థిక సంఘం నిధులను విరుద్ధంగా మళ్లించారు. దాదాపు 27.82కోట్ల నిధులను కర్నూలు కార్పోరేషన్‌తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు పురపాలక సంఘాల్లో ఈ ఆర్థిక నిధులను విద్యుత్‌ బకాయిలకు చెల్లింపులు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసే విషయంపై కేంద్రం పలు నిబంధనలు, పరిమితులు విధించింది. ఈ నిధులలో ఖచ్చితంగా 50 శాతం మురుగు కాల్వల నిర్మాణాలకు ఖర్చుచేయాలి. మిగిలినవి తాగునీరు, పారిశుద్యానికి వినియోగించాలి, వీటికి విరుద్దంగా జిల్లావ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో విద్యుత్‌ బకాయిలకు జమ చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా పారిశుధ్యానికి కేటాయించారు. ఇప్పటికే కొన్ని పురపాలక సంఘాల్లో చాలావరకు ఖాళీచేశారు. జిల్లాలోని పురపాలకాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.32.22కోట్ల మేర విద్యుత్‌ బకాయిలు ఉండగా, వాటిలో రూ.27.82కోట్ల నిధులను సర్దుబాటు చేశారు. ఈ నిధులలో కర్నూలు కార్పోరేషన్‌కు సంబంధించి రూ.7.20కోట్లు, డోన్‌ మునిసిపాలిటీకి సంబంధించి రూ.10.48కోట్లు అధికంగా సర్దుబాటు చేశారు.

15వ ఆర్థిక సంఘం నిధులు కర్నూలు కార్పోరేషన్‌కు రూ.29,39,20,744, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.38.25కోట్లు, విద్యుత్‌ బకాయి రూ.7.20కోట్లు సర్దుబాటు చేశారు. నంద్యాల మునిసిపాలిటీకి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.13,24,05,796 లక్షలు, 14వ ఆర్థిక సంఘంలో రూ.44.34కోట్లు, విద్యుత్‌ బకాయి రూ.42.72లక్షలు ఉండగా ఆ మొత్తాన్ని సర్దుబాటు చేశారు. ఇదేవిధంగా ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరులో కూడా విద్యుత్‌ బకాయిలు రూ.1.57కోట్లు, రూ.29.01 లక్ష, రూ.10.48కోట్లు, రూ.4.50కోట్లు, రూ.3.99కోట్లు, రూ.69.33లక్షలు జమ చేశారు. పురపాలకాల్లో సాధారణ, ఇతర నిధులతో పనులు పూర్తిచేసినా గుత్తేదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా పైపులైన్లు, సిసి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్దుబాటుతోనే నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement