Saturday, May 18, 2024

ఫ్యాన్సీగా ఉందని అంకె చెప్పారు.. ప్రజలకు ఒరిగిందేమీ లేదు: బీజేపీ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీజేపీ నేతలు విమర్శించారు. మత ప్రాతిపదికన పథకాలు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు చెపుతూ కులాల వారీగా ప్రజలను విభజించడాన్ని కూడా మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర బడ్జెట్‌పై శుక్రవారం ఏపీ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేత సుధీష్‌ రాంబొట్ల, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణ రెడ్డి, పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ బడ్జెట్‌ కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు, మద్యంపై ఆదాయం, అప్పులు అనే నాలుగు స్తంభాలపై ఉందన్నారు. పది నెలల్లోనే రూ.45,978 కోట్లు రెవిన్యూ లోటు కాగా అంకెల గారడీని తలపించే రీతిలో బడ్జెట్‌ రూపొందించారన్నారు. గ్రామ సడక్‌ యోజన కింద వేసిన రోడ్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం వేసినవిగా చెప్పుకుంటున్నట్లు వారు తెలిపారు. అమరావతి రాజధానిగా హైకోర్టు ప్రకటించిన అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతిపై కూడా బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. మౌళిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యవమని వారు పేర్కొన్నారు.

కేవలం ఫ్యాన్సీగా ఉందని రూ.2,56,256.56 కోట్లు అని ఎంచుకున్నారు తప్ప రాష్ట్ర పురోగతికి ఉపకరించే అంశాలేవీ లేవన్నారు. అంచనాలకు మించి ఖర్చు తప్ప ఆదాయ వనరుల గురించి ప్రస్తావించలేదన్నారు. పన్నుల ఆదాయం పెరిగిందంటే మోడీ వన్‌ నేషన్‌ వన్‌ టాక్స్‌ విధానమే కారణమని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజులో లక్ష్యాన్ని మించి రెవిన్యూ ఆర్జించినట్లు పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక విధానాలతో పక్క రాష్ట్రాలు బాగుపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. వ్యవసాయ బడ్జెట్‌ సీఎంను పొగడ్తలతో ముంచెత్తే కరపత్రంలా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement