Sunday, April 28, 2024

విమాన ప్రయాణికులకు డిజీ యాప్‌.. అంతరాయాలు లేని ప్రయాణం

అమరావతి, ఆంధ్రప్రభ : గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇకపై బోర్డింగ్‌ పాస్‌లు, వ్యక్తిగత ఐడీ ఫ్రూప్‌లు చూపకుండా ప్రవేశ ద్వారం మొదలు విమానమెక్కే వరకు ఎటువంటి చెకింగ్‌ లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇది ప్రయాణీకుల విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ప్రయాణీకుడు తన సెల్‌ ఫక్షన్‌లో ‘డిజి యాప్‌’ అనే దానిని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంది. తాజాగా మరో మూడు విమానాశ్రయాలలో ఈ సేవలను ప్రారంభించగా అందులో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటిగా ఉంది. మిగిలిన రెండు విమానాశ్రయాలు కోల్‌కతా మరియు పూణే ఉన్నాయి.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించే దేశీయ విమాన ప్రయాణీకులు విమానాశ్రయం ప్రవేశ ద్వారం నుండి ముఖ గుర్తింపు వ్యవస్థను ఉపయోగించి ఫూల్‌ప్రూఫ్‌ సిస్టమ్‌తో అవాంతరాలు లేని ప్రయాణాన్ని ఆస్వాదించనున్నారు. ఇందుకోసం విమాన ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లలో ‘డిజి యాత్ర’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ యాప్‌ ఓపెన్‌ చేసి తమకు సంబంధించిన ఇతర ఆధారాలతో పాటు ఆధార్‌ కార్డు వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. ఒకసారి పూర్తి చేసిన తర్వాత, వారు భద్రతా తనిఖీలు లేకుండా, వారి ఐడీలను చూపకుండా లోపలకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా బోర్డింగ్‌ పాస్‌లు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

ఆ యాప్‌ లేకపోతే..

- Advertisement -

యాప్‌ లేని ప్రయాణీకుల కోసం విమానాశ్రయ అధికారులు ప్రవేశ ద్వారం వద్ద నాలుగు కౌంటర్లను ఏర్పాటు- చేశారు, అక్కడ వారు 30 సెకన్లలో డిజి యాత్రకు నమోదు చేసుకోగలిగే విధంగా రిజిస్ట్రేషన్‌ కేంద్రాలకు పంపుతారు. వారు అక్కడ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవడం ద్వారా అవాంతరాలు లేని ప్రయాణాన్ని పొందవచ్చు. దేశీయ విమాన ప్రయాణికులందరికీ తమ సెల్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోగలిగే ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ‘డిజి యాత్ర’ యాప్‌తో ఎలాంటి ఇబ్బంది లేని ప్రయాణాన్ని పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనిద్వారా క్యూ లైన్లలో నిరీక్షించే బెడద తప్పుతుందని పేర్కొంటున్నారు. సాంకేతికత ద్వారా అన్ని రకాల బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌లను ఈ యాప్‌ పూర్తి చేస్తుందని అంటున్నారు. సులభమైన ప్రయాణం కోసం ఫూల్‌ప్రూఫ్‌ భద్రతను పొందడం ద్వారా ప్రయాణీకులు విమానాశ్రయంలోకి వెళ్లి నేరుగా తమ విమానంలో ఎక్కవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement