Thursday, May 9, 2024

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, కొత్త జిల్లాలపై భిన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు కొత్త జిల్లాలకు మద్దుతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని రెవెన్యూ డివిజన్ల రద్దుపై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సంవత్సరాది ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. అందుకు తగినట్లు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను, వేరే జిల్లా పరిధిలోకి తీసుకురాబోతున్నారంటూ కొన్నిచోట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్స్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న పాణ్యం అసెంబ్లీ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యంతో పాటు గడివేముల మండలాల వారు వ్యతిరేకిస్తున్నారు. అలాగే పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు మండలాలు కర్నూలుకు దగ్గరలో ఉంటాయి. జిల్లా విభజన జరిగితే కల్లూరు, ఓర్వకల్లు మండలాలను కర్నూలు జిల్లాలో కలపాలంటూ అక్కడి వారు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో వారి ఆకాంక్ష నెరవేరింది. కానీ పాణ్యం, గడివేముల మండలాల వారికి ఇది చాలా ఇబ్బందిగా మారింది. నంద్యాలకు చాలా సమీపంలో ఉండే తమను చాలా దూరంలో ఉండే కర్నూలు జిల్లాలో కలపడమేమిటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడంపై రాజంపేట మునిసిపల్‌ వైస్‌ చైర్మన్ మర్రి రవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతుందని హెచ్చరించారు. రాయచోటిని, మదనపల్లెని కలిపి వేరే జిల్లాగా చేసుకోవాలంటూ మర్రి రవి అన్నారు. అలాగే ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడంతో పాటు కందుకూరు అసెంబ్లీ స్థానాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడంపై కూడా ప్రజాసంఘాలు నిరసనకు రంగం సిద్ధం చేశాయి. ఇక మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటూ ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంత ప్రజల డిమాండ్‌.

- Advertisement -

కనిగిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలంటూ అక్కడి స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఏర్పాటు కాబోయే బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లపై కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు అసెంబ్లీ స్థానాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలపడంపై కూడా స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. విజయవాడకు దగ్గరలో ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్ని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాలో చేర్చడంపై కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండింటినీ ఎన్టీఆర్‌ జిల్లాలో చేర్చాలంటూ అక్కడి వారి డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం, పాలకొండ, పలాస కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలనే వాదన తెరపైకి వచ్చింది. అరకు లోక్‌సభ స్థానం చాలా పెద్దదిగా ఉండడం వల్ల దాన్ని మూడు జిల్లాలుగా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని చంద్రగిరి తిరుపతికి దగ్గరగా ఉంటుంది. దీంతో చంద్రగిరిని శ్రీబాలజీ జిల్లా పరిధిలోకి తీసుకువచ్చారు. తిరుపతి పరిధిలోని సర్వేపల్లిని నెల్లూరు జిల్లా పరిధిలోకి మార్చారు. తాజా మార్పులతో కొన్ని లోక్‌సభ స్థానాలకు 8 అసెంబ్లీ స్థానాలు వస్తుంటే.. మరికొన్ని జిల్లాలు 6 శాసనసభ స్థానాలతోనే ఏర్పాటు కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement