Sunday, May 5, 2024

తిరుమలలో ధర్మరథం, ఉచిత బస్సుల స్థానంలో.. విద్యుత్‌ బస్సులు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణలో టీటీడీ మరో ముందడుగు వేసింది. తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథాల (ఉచిత బస్సులు) స్థానంలో విద్యుత్‌ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఒలెక్ట్రా కంపెనీప్రతినిధులు, ఆర్టీసీ, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం చైర్మన్‌ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుమలను కాలుష్యరహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ప్లాస్టిక్‌ బాటిళ్ళు, కవర్లు నిషేదం కూడా ఇందులో ఒక భాగమన్నారు. తొలివిడతగా తిరుమలలో పనిచేసే అధికారులకు విద్యుత్‌తో కార్లను అందచేశామన్నారు. రెండవ విడతగా తిరుపతి, తిరుమల మధ్య విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టామన్నారు. వీటికి భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. రెండవ విడతలో తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథాల స్థానంలో విద్యుత్‌ బస్సులు నడిపేందుకు 10 బస్సులు విరాళంగా ఇవ్వాలని ఒలెక్ట్రా కంపెనీ అధినేత కృష్ణారెడ్డిని కోరానని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ. 15 కోట్ల విలువచేసే 10 విద్యుత్‌ బస్సులను విరాళంగా అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. బస్సుల డిజైనింగ్‌, నిర్వహణ ఎలా ఉండాలనే అంశం పై చర్చించేందుకు సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. భక్తులకు సదుపాయంగా ఉండేలా బస్సులను డిజైన్‌ చేయాలని సూచించినట్లు చెప్పారు. మూడవదశలో తిరిగే ట్యాక్సీలు, ఇతర అద్దె వాహనాల స్థానంలో టీటీడీ సహకారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి విద్యుత్‌ వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ సందర్భంగా ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు బస్సుల డిజైన్లు, నిర్వహణ అంశాల పై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. టిటిడి చైర్మెన్‌ కోరిక మేరకు 10 విద్యుత్‌ బస్సులు విరాళంగా అందించడం శ్రీవేంకటేశ్వరస్వామివారు తమకు అందించిన గొప్పవరంగా భావిస్తున్నామని కంపెనీ సీఎండి ప్రదీప్‌ చెప్పారు. ఆర్టిసి ఎగ్జ్‌క్యూటివ్‌ డైరెక్టర్‌ గోపినాథ్‌రెడ్డి, జిల్లా ప్రజారవాణా అధికారి చెంగల్‌రెడ్డి, టిటిడి రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, తిరుమల డిపో మేనేజర్‌ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టిటిడి చైర్మెన్‌ అన్నమయ్య భవనం నుంచి లేపాక్షి సర్కిల్‌ వరకు అధికారులతో కలసి విద్యుత్‌ బస్సులో ప్రయాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement