Thursday, April 25, 2024

ఉన్నత విద్య పరీక్ష విధానంలో మార్పు.. క్షేత్రస్థాయి పరిశీలనకు ఐఎస్‌బీ

ఉన్నత విద్య పరీక్ష విధానంలో గుణాత్మక మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో రాష్ట్ర ఉన్నత విద్య మండలి, కమిషరేట్‌ ఆఫ్‌ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ శుక్రవారం ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విద్యార్థి నైపుణ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే పరీక్ష విధానం భవిష్యత్‌లో అతనికి గుర్తింపునిచ్చేదిగా, ఉపాధికి బాటలు వేసే విధంగా ఉండాలన్నదే ఈ ఎంవోయు లక్ష్యమని ఉన్నత విద్య మండలి పేర్కొంది.
ఇప్పుడున్న పరీక్షల విధానంలో తీసుకురావాల్సి మార్పులపై ఐఎస్‌బీ అధ్యయనం చేసి, ఆరు నెలల్లో నివేదిక ఇవ్వనుంది. విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన పరీక్షలు ఎలా ఉండాలనేది క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా తెలుసుకోబోతున్నారు. అంతర్గత పరీక్షలతో సహా కాలేజీ విద్యలో జరిగే అన్ని పరీక్షల విధానాలను పరిశీలించి, సరికొత్త ఫ్రేమ్‌వర్క్‌తో కొన్ని సిఫార్సులు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థి నైపుణ్యాన్ని ఎలా అంచనా వేయాలనేది సూచిస్తుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీయేట్‌ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ, నవీన ఆలోచన విధానం, భవిష్యత్‌ మార్పుల విషయంలో తెలంగాణ ముందంజలో ఉందని, తాజా ఎంవోయు దీనికి నిదర్శనమన్నారు. విద్యావిధానంలో విద్యార్థి నైపుణ్యతను సరికొత్తగా వెలికి తీసేందుకు అధ్యయనం తోడ్పడుతుందన్నారు. ఉన్నత విద్య మండలి ఛైర్మన ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి మాట్లాడుతూ, ప్రస్తుత పరీక్ష, మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థి కూడా ఉపాధి విషయంలో సవాళ్ళు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

విద్యార్థుల్లోని లోతైన ఆలోచన విధానాన్ని, సమస్యలు పరిష్కరించే సామర్థా‍్యన్ని అంచనా వేయాలని భావిస్తున్నామని, కానీ ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానంలో వారి జ్ఞాపకశక్తిని మాత్రమే అంచనా వేస్తున్నామని తెలిపారు. ఐఎస్‌బీ దీనిపై సమగ్ర అధ్యయనం చేసి, సరైన మూల్యాంకన విధానం, బోధన ప్రణాళిక తీరు, టీచింగ్‌ మెథడ్స్‌లో తీసుకురావాల్సిన మార్పులను సూచిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement