Monday, April 29, 2024

తెలుగు రాష్ట్రాల్లో రక్షణ పరికరాల ఉత్పత్తి యూనిట్లు.. వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు పలు రాష్ట్రాల్లో రక్షణ పరికరాల ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రక్షణ పరికరాల ఉత్పత్తి యూనిట్లను స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ప్రణాళిక ఉందా? దేశవ్యాప్తంగా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లాలో వాటిని ఏర్పాటు చేసే అవకాశముందా? భవిష్యత్‌లో అయినా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బీజేపీ ఎంపీ సురేష్ పూజారి అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ శుక్రవారం జవాబిచ్చారు.

మూడు రక్షణ పీఎస్‌యూలైన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ( బీడీఎల్), మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థలు కొత్త రక్షణ పరికరాల ఉత్తత్తి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాయని వివరించారు. బీఈఎల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని పాలసముద్రం, నిమ్మలూరులో, తెలంగాణాలోని ఇబ్రహీంపట్నంలోతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో యూనిట్లు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. బీడీఎల్ కింద ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో, మిధానీ-నాల్కో సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో యూనిట్లను పెడుతున్నట్టు అజయ్ భట్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకైతే ఒడిశాలో రక్షణ పరికరాల తయారీ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొత్త ప్రతిపాదనలేమీ లేవని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement