Tuesday, May 7, 2024

కౌలు రైతులకు తగ్గుతున్న బ్యాంకుల రుణ పరపతి.. వ్యవసాయం వైపు కౌలు రైతుల నిరాసక్తత

అమరావతి : ఆంధ్రప్రభ : కౌలు రైతుల సంక్షేమానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని.. వారిని ఆదుకునేందుకు ఎంతైనా చేస్తామని పదేపదే ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాల మొత్తం, కౌలుదారుల సంఖ్యను చూస్తే రైతులు నష్టపోతున్నట్లు స్పష్టమవుతోంది. గత మూడేళ్లుగా రైతులకు అందిస్తున్న రుణ మొత్తం గణనీయంగా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. చివరకు కౌలు రైతుల సంఖ్య కూడా అదే క్రమంలో క్షీణిస్తోంది.

- Advertisement -

2020 మార్చి వరకు 2,31,345 మంది కౌలు రైతులను గుర్తించి వారికి రూ.2,303 కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలను అధికారులు అందించారు. 2021 మార్చినాటికి కేవలం 96,947 మందికే రుణాలు అందించారు. అది కూడా అంతకుముందు సంవత్సరం కన్నా సగానికి తక్కువగా రూ.1,054 కోట్లు మాత్రమే అందించారు. 2022 మార్చినాటికి 1,80,562 మంది కౌలు రైతులకు రూ.1,744 కోట్లు రుణంగా అందించారు. 2021 కన్నా రైతులు, రుణం సంఖ్య 2022లో పెరిగినప్పటికీ, 2020తో పోల్చి చూస్తే బాగా తగ్గిపోయింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ వరకు గణాంకాలు చూస్తే కౌలు రైతులకు తక్కువగానే సాయం అందింది. కేవలం 1,63,811 మందికి మాత్రమే సాయం అందించగా, వారికి అందించిన రుణం కూడా రూ.1,126 కోట్లుగానే ఉంది. ఇది లక్ష్యంలో కేవలం 28 శాతమే కావడం విశేషం. కౌలు రైతులకు అందించాల్సిన రుణాలపై బ్యాంకర్లతో అనేక సమావేశాల్లో చర్చిస్తున్నప్పటికీ లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోతుండడంతో పేద రైతులు భారీ వడ్డీలకు బయట రుణాలపై ఆధారపడాల్సి వసోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement