Monday, April 29, 2024

Big Story: ఖరీఫ్‌ సీజన్లో తగ్గిన పంటల సాగు.. 9 లక్షల ఎకరాల్లో పడని నాట్లు

అమరావతి : ఆంధ్రప్రభ : ఈ ఏడాది వ్యవసాయానికి అన్నీ అనువుగా ఉన్నా అన్నదాతల అనాసక్తత కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల ఎకరాల్లో పంట వేయలేదు. ప్రధానంగా పెరిగిన పెట్టు-బడి వ్యయం.. ప్రకృతి వైపరీత్యాలు.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో రైతులు సాగు వైపు మొగ్గు చూపలేదు. సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు ముగిసినట్లే. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు సీజన్‌ సమయం కాగా సాధారణ విస్తీర్ణంలో తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా సాగు కాలేదు.

సాధారణ సాగులో పది శాతం విస్తీర్ణంలో సాగు లేక భూములు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది పంటల సాగు కాస్త ఆలస్యంగా మొదలైనందున అక్టోబర్‌లోనూ కొంత మేరకు సేద్యం జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అక్టోబర్‌ రెండోవారం వరకు వరి నాట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆశలు, అంచనాలు ఎలా ఉన్నా ఈ సంవత్సరం సీజన్‌ ప్రారంభం నుంచీ సాగు ముమ్మరంగా లేదు.

కీలక సమయాల్లోనూ నత్తనడకనే నడిచింది. సాగు ఖర్చులు పెరగడం, సంస్థాగత అప్పులు పుట్టకపోవడం, అన్నింటికీ మించి పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విపత్తు, తెగుళ్ల నష్టాల కారనంగా రైతులు నిరాశా నిస్పుహ్రలకు లోనై కొన్ని పంటల సేద్యంపై అనాసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ కారణాల వలన సాధారణ సాగులో తొమ్మిది లక్షల ఎకరాలకు మించి లోటు నెలకొంది. ప్రభుత్వం ఈ ఏడాది 96.42 లక్షల ఎకరాల్లో పంటల సాగును లక్ష్యంగా నిర్ణయించింది. సాధారణ సాగు విస్తీర్ణం 92.05 లక్షల ఎకరాలు. సెప్టెంబర్‌ నెలాఖరుతో సీజన్‌ ముగుస్తుండగా 82.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణం కంటే 9.22 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది.

- Advertisement -

ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం కంటే 13.62 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. గతేడాది ఇదే సమయానికి సాధారణం కంటే 10 లక్షల ఎకరాల్లో సేద్యం తగ్గింది. ఖరీఫ్‌ వేళకొచ్చే నైరుతి రుతుపవనాలు జూన్‌ 13న ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి 20 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించాయి. అక్కడక్కడ డ్రై-స్పెల్స్‌ ఉన్నప్పటికీ సీజన్‌ మొత్తమ్మీద సాధారణ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ 28 నాటికి నార్మల్‌ 556 మిల్లీమీటర్లు కాగా 563.2 మిమీ వర్షం పడింది. కాకినాడ, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం పడగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో తక్కువ వర్షం పడింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షం నమోదయింది.

రిజర్వాయర్లన్నింటిలో నీటి నిల్వలు ఆశాజనకంగానే ఉన్నాయి. భూగర్భ జలాలకు ఇబ్బంది లేదు. కాగా ఇప్పటికి 105 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ప్రధానమైన ఆహార పంటల సాగు తగ్గింది. వరి, అపరాలు, చిరుధాన్యాలు, పప్పులు, నూనెగింజలు అన్నీ సాధారణంగా కంటే తక్కువ సాగయ్యాయి. అపరాల్లో మొక్కజొన్న మాత్రం వంద శాతానికిపైన సాగైంది. వాణిజ్యపంటల్లో పత్తి నార్మల్‌ కంటే కొంచెం ఎక్కువ సాగైంది. మిరప సైతం స్వల్పంగా పెరిగింది. చెరకు, పొగాకు, ఇతర పప్పుధాన్యాలు తగ్గాయి. పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 51-75 శాతం మధ్య సేద్యం జరగ్గా, వైఎస్‌ఆర్‌, అనంతపురంలో వంద శాతానికి మించి సాగు నమోదైంది. తతిమ్మా జిల్లాల్లో 76-100 వంద శాతం లోపు సేద్యం జరిగింది. ఇదిలా ఉండగా సాధారణంగా సీజన్‌ చివరిలో ప్రభుత్వం పంటల సాగు గణాంకాలను విడుదల చేసేది. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా పొడిపొడిగా సాగు వివరాలు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement