Saturday, April 27, 2024

రాజధాని వివాదానికి ముగింపు పలకండి: మార్క్సిస్టు

ఏపీ రాజధాని వివాదానికి ముగింపు పలకాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేర్కొంది. ప్రజల మనోభిప్రాయాలు, న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టం (మూడు రాజధానులు), సిఆర్‌డిఏ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే రాజధాని వివాదానికి ముగింపు పలకకుండా మళ్ళీ సమగ్రమైన మూడు రాజధానుల బిల్లు తీసుకు వస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం ఆక్షేపణీయం అని రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. రాజధానికి, వికేంద్రీకరణకు ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రాజధాని నిర్మాణానికి తక్షణం పూనుకోవాలని, కేంద్రం నిధులిచ్చి తోడ్పడాలని సూచించారు. అదే సందర్భంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర తదితర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ ద్వారా నిధులివ్వాలని విభజన చట్టంలో ఉన్నా.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒకవైపున రాజధాని అమరావతికి, మరోవైపున వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు సాధించి రాష్ట్రాభివృద్ధికి పూనుకోవాలని సిపిఐ(యం) కోరారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీల కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని మధు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement