Thursday, May 2, 2024

విశాఖలో 300 పడకల ఆక్సిజన్ కోవిడ్ కేర్ సెంటర్

ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్యసేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుతున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. విశాఖ జిల్లాలో కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు అవసరమైన చికిత్స, వసతులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విశాఖ షీలానగర్‌లోని వికాస్ కళాశాలలో 300 పడకల ఆక్సిజన్ కొవిడ్  కేర్ సెంటర్‌ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ప్రగతి భారతి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్,  ఎంపీ విజయసాయి రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అనే సిద్ధాంతంతో రాష్ట్రంలో సీఎం ముందుకు వెళుతున్నారని తెలిపారు. కొన్నిఅనుభవాల వల్ల ఆక్సిజన్ సరఫరా నిరంతరాయంగా సాగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాజధాని నగరంగా విశాఖలో 300 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. 104, నోడల్ ఆఫీసర్ ద్వారా ఏ రోగి వచ్చినా సరే అడ్మిట్ చేసుకుంటారని తెలిపారు. 90కి తగ్గకుండా ఆక్సిజన్ ఉన్న రోగుల చికిత్సకు  అనుమతి ఇస్తామని తెలిపారు. ప్రతీ బెడ్ దగ్గర 60 లీటర్ల సిలిండర్లను ను ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ లో మెడిసిన్స్ ఉచితంగా అందిస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement