Thursday, November 7, 2024

కూల్‌డ్రింక్‌ షాపులే మద్యం బార్లు.. ఏసీబీ దాడులు చేస్తున్నా మారని ఎస్‌ఈబీ తీరు

సూళ్లూరుపేట, (ప్రభన్యూస్‌): అనధికారిక మద్యం అమ్మకాలతో పాటు కూల్‌డ్రింక్‌ షాపులను మద్యం బార్లుగా మార్చుకునేందుకు ఎస్‌ఈబీ అధికారులు పైసలు తీసుకుని పచ్చజెండాలు ఊపుతున్నారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల పక్కనే ఉన్న కూల్‌డ్రింక్‌ షాపులు మద్యం బార్లుగా మారుతున్నాయి. నాయుడుపేటలో కూల్‌డ్రింక్‌ షాపులను మద్యం బార్లుగా మార్చి నెలసరి మామూళ్లు దండుకుంటూ ఏసీబీకీ చిక్కిన విషయం విధితమే. ఓ సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్‌ కూడా చేశారు. అయినా నాయుడుపేటకు పక్కనే ఉన్న సూళ్లూరుపేట సెబ్‌ అధికారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నాయుడుపేటలో అవలంభించిన విధంగానే సూళ్లూరుపేటలోను కూల్‌డ్రింక్‌ షాపుల్లో మద్యంతాగే వెసులుబాటు కల్పించి ఆ షాపులను బార్లుగా మార్చివేసి ఉన్నారు. అదికూడా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉన్న ప్రాంతంలో ఇలా కూల్‌డ్రింక్‌ షాపుల్లో మద్యం సేవిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మండల తహశీల్దార్‌ కార్యాలయం, మండల పరిషత్‌ అభివృద్ది కార్యాలయం, హౌసింగ్‌, సబ్‌రిజిష్టార్‌ కార్యాలయాలన్నీ సూళ్లూరుపేటలో ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన గేటుకు ఎదురుగా ప్రభుత్వ మద్యం షాపు ఉంది. ఆ షాపుకు ఇరుపక్కల రెండు కూల్‌డ్రింక్‌ షాపులను ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రభుత్వ మద్యం షాపును మూసివేసిన తర్వాత ఈ కూల్‌డ్రింక్‌ షాపుల్లో మద్యం అందుబాటులో ఉంటుంది.

అంతేకాదు అక్కడ మందుబాబులు తాగి తూలేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. దీంతో మందుబాబులు ఆ కూల్‌డ్రింక్‌ షాపుల్లోనే మద్యం సేవిస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఎస్‌ఈబీ అధికారులకు తెలిసినా పట్టించుకోక పోవడం వెనుక మామూళ్ల వ్యవహారమేనన్న విమర్శలు వెలివెత్తుతున్నాయి. సూళ్లూరుపేటలోని అన్ని ప్రభుత్వ మద్యం షాపుల పక్కన కూల్‌డ్రింక్‌ షాపులను ఏర్పాటు చేసి ఆ షాపుల్లో మద్యం సేవించే విధంగా కూల్‌డ్రింక్‌ షాపుల యజమానులు ఏర్పాటు చేసి ఉండడంతో శీతల పానియాలను కొనుగోలు చేసేందుకు ఆ కూల్‌డ్రింక్‌ షాపుల వద్దకు వెళ్లే మహిళలు అక్కడ తాగుబోతులను చూసి అవాక్కవుతున్నారు. బహిరంగంగా మద్యం సేవించడమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు అనునిత్యం వచ్చే అధికారులు, సమస్యలతో అర్జీలు చేతపట్టుకుని వచ్చే ప్రజలు ఈ దృశ్యాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కొన్ని పర్యాయాల్లో పీకలదాక మద్యం సేవించిన వారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళా అర్జీదారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికారికంగా మద్యం అమ్మకాలు సాగించడం, మందుబాబులకు మద్యం సేవించే విధంగా ఏర్పాటు చేసి కూల్‌డ్రింక్‌ షాపులను బార్లుగా మార్చివేసి ఉండడం వంటి సంఘటనలపై తక్షణం పరిశీలన చేసి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరత ఎంతైనా ఉందని పురప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement