Sunday, May 5, 2024

ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో కలకలం.. పేపర్లో వార్తలొస్తే ఊరుకోమని ఉద్యోగులకు వార్నింగ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: హెచ్‌ఐవీ మందుల కొరత ఉందని పేపరోళ్ళకి ఎందుకు చెబుతున్నారు. ఏ మందు కొరత ఎంత ఉందో స్పష్టంగా రాయగలుగుతున్నారంటే మనవాళ్ళే చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోసారి పేపర్లో వార్త వస్తే సమాచారం ఇచ్చే వాళ్ళపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం నిఘాను పెట్టం అంటూ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సుందరి హెచ్చరికలు జారీ చేశారు. ‘మందుల్లేవ్‌’ శీర్షికన ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనం సాక్స్‌ అధికారుల్లో కలకలం రేపింది. ప్రాజెక్ట్‌ ఏడీ సుందరి సంబంధిత ఉద్యోగులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సాక్స్‌లో జరిగే విషయాలు పేపర్‌ వాళ్ళకు ఎందుకు చెబుతున్నారంటూ ఉద్యోగులపై మండిపడ్డారు. పేపర్‌ వాళ్ళకు తెలిస్తే మందుల కొరత మాత్రమే అని రాస్తారు. అదే మనవాళ్ళు చె ప్పారు కాబట్టే సెకండ్‌ స్టేజ్‌కు మొదటి స్టేజ్‌ మందులు ఇస్తున్నారని వాటి పేర్లతో సహా రాయగలిగారు. ఇలా అయితే కష్టం మీరే ఆలోచించుకోండి అంటూ వార్నింగ్‌ ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. లోపాలను సరిదిద్దాల్సింది పోయి తమపై ఏడీ విరుచుకుపడటంతో ఏం చేయాలో పాలుపోని ఉద్యోగులు తలలుపట్టుకున్నారు.

మందుల కొరత రానీయం

హెచ్‌ఐవీ రోగులకు మందుల కొరత రానీయమని ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హైమావతి తెలిపారు. ప్రతి సంవత్సరం నాకోనే మందులు సరఫరా చేస్తోందని గతేడాది నవంబర్‌ నుంచి స్థానికంగానే మందులు కొనుగోలు చేసి రోగులు అందజేయాల్సిందిగా నాకో సూచించిందన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలకు సరిపడ నిధుల్ని విడుదల చేయడం జరిగిందన్నారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సరిపడా మందుల్ని సరఫరా చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా మందుల కొరత ఉన్నట్లైతే నేరుగా తనకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆమె సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement