Sunday, April 28, 2024

Construction Delay – ఎపికి పోల‌’వ‌రమా’…శాప‌మా.. ?

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి గోదావరి జలాలను పుష్కలంగా రైతులకు అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నతమైన ఆశయంతో అడుగులు వేస్తూ వెళ్తున్నారు. లోటు బడ్జెట్‌లోనూ పోలవరా న్ని పూర్తిచేసి జాతీయ ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని సంకల్పించారు. అందుకోసం ఢిల్లి వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దలతో మాట్లాడి పోలవరానికి నిదులు తీసుకురావడంలోనూ, ఆపనులను వేగ వంతంగా పూర్తిచేయించడంలోనూ ఆయన అంతే వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే, మరో వైపు నిర్మాణ లోపమో, నాణ్యతలో డొల్ల తనమో ఏమో తెలియదుకాని వరదలు వచ్చిన సందర్భం లోనూ వరదలు తగ్గుముఖం పట్టిన సందర్భం లోనూ ప్రాజెక్టులోని
కీలకమైన విభాగాలు కుంగిపోతున్నాయి. గతంలో ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయా ఫ్రం వాల్‌ దెబ్బతింది. దాని మరమ్మతులు చేపట్టడానికి రెండేళ్ల సమయం పట్టింది. ఆ సమస్య పరిష్కారమైందనుకునేలోపే తాజాగా స్పిల్‌వే రిటైనింగ్‌ వాల్‌ ప్రాజెక్టువైపుకు కుంగినట్లు తెలుస్తుంది. అధికారులు ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటికే జలవనరుల శాఖ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి పోలవరాన్ని సందర్శించిన సందర్భంలోనూ ఆప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుని నిర్మాణం పూర్తిచేస్తున్న పోలవరం ప్రాజెక్టుపై మొదటి నుండి కూడా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అలాగే నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో నవయుగ సంస్థ పోలవరం పనులను చేపట్టింది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పోలవరాన్ని పూర్తి చేయడంలో నవయుగ జాప్యం చేస్తుందని నిర్మాణ పనుల్లో కూడా ఆశించిన నాణ్యత కనిపించడం లేదని రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా మెగా కంపెనీకి పోలవరం బాధ్యతలను అప్పగించింది. గడచిన మూడున్నర సంవత్సర కాలంగా పనులను శరవేగంగా సాగుతున్నప్పటకీ నిర్మాణం పూర్తయిన కీలక విభాగాలు మాత్రం వరదలు వచ్చిన సందర్భంలో ఏదో ఒక ప్రాంతంలో దెబ్బతింటుండడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

గతంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌
2019లో వచ్చిన వరదల వల్ల పోలవరం డయా ఫ్రం వాల్‌ దెబ్బతింది. వరదల్లో భారీగా ఇసుక మేటలు ఏర్పడటం, మరికొన్ని ప్రాంతాల్లో ఇసుక కోతకు గురికావడం తదితర కారణాలతో సుమారు 160 మీటర్ల ప్రాంతం వరకూ దెబ్బతింది. దీంతో దెబ్బతిన్న ప్రాంతాన్ని అధ్యయనంచేసి ఎగువ కాపర్‌ఒ డ్యాం గ్యాప్‌ 1, 2, స్పిల్‌వే అప్రోచ్‌ ఛానల్‌ డీ వాల్‌ గ్యాప్‌ 1లో రింగ్‌ఒ బండ్‌ వేసి శరవేగంగా అప్పట్లో దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతులు చేశారు. అప్పట్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని ఢిల్లి నుండి ప్రత్యేక నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలించింది. ఆసమయంలో నిర్మాణ పనులపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రతిపక్షాలైతే పోలవరంలో నాణ్యత డొల్ల అంటూ విమర్శల బాణాలను వదిలాయి. తెలుగుదేశం, వైసీపీల మధ్య కొన్ని రోజులపాటు డయా ఫ్రం వాల్‌పైనే వార్‌ నడిచింది. అయితే, సీఎం జగన్‌ ఆపనులను ఓ సవాల్‌గా తీసుకుని పూర్తిచేయించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కుంగిన స్పిల్‌ వే రిటైనింగ్‌ వాల్‌ ?
ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ప్రాంతంలోని స్పిల్‌ వే రిటైనింగ్‌ వాల్‌ కుంగినట్లు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసినప్పుడు నీటి ఒత్తిడిని తగ్గించడానికి స్పిల్‌వేపై డీ వాల్‌ను నిర్మించారు. అయితే ఇటీవల వరదల వల్ల డీ వాల్స్‌ అడుగు భాగంలో ఉన్న కంకరు, ఇసుక, కాంక్రీటు కొట్టుకుపోవడంతో ఆప్రాంతంలో రిటైనింగ్‌ వాల్‌ కుంగిపోయినట్లు సమాచారం. ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసిన ప్రతి సారీ వత్తిడి తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఈ వాల్‌ ప్రారంభానికి ముందే కుంగిపోవడం నిర్మాణ పనుల్లోని నాణ్యతన ప్రశ్నిస్తుంది. జాతీయ ప్రాజెక్టు జాతికి అంకితం కాకముందే ప్రాజెక్టులోని కీలకమైన విభాగాల్లోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతుందన్న ఆరోపణలు కూడా స్థానికుల నుండి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

- Advertisement -

రైతుల్లో ఆందోళన
2022 డిసెంబరు నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీటిని విడుల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే ఆపనులను అత్యంత వేగవంతంగా చేయిస్తూ వస్తున్నారు. అయితే, గోదావరికి భారీగా వరదలు రావడంతో నిర్మాణ పనులకు అనేక సందర్భాల్లో ఆటంకం ఏర్పడింది. అయితే, రైతులకిచ్చిన మాట ప్రకారం సకాలంలోనే ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ఉద్దేశ్యంతో నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థ ప్రత్యేక యంత్రాలను ఉపయోగించి మరీ వరద నీటిలోనూ నిర్మాణ పనులను చేపట్టింది. అయితే వర్షా కాలంలో భారీగా వరద నీరు వస్తుండటం, సీజన్‌ దాటిపోయిన గోదావరికి వరద పోటెత్తుతుండటంతో ప్రభుత్వం కూడా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు గడువును కూడా పెంచింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్పిల్‌ వే రిటైనింగ్‌ వాల్‌ కుంగిపోవడం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం అవుతుందేమో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement