Sunday, May 5, 2024

Congress – మీ ఆడబిడ్డను.. ఆశీర్వదించండి – పులివెందుల ప్రజలకు షర్మిల విజ్ఞప్తి

చిన్నాన్న చంపించారు
కేసుల్లో ఉన్నోళ్లు దర్జాగా తిరుగుతున్నారు
అన్న జగనే సీటిచ్చారు
రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. అక్రమార్జనే ఉంది
మీ రాజన్న బిడ్డను గెలిపించండి
లింగాల మండల కేంద్రంలో ఉద్రిక్తత
ప‌ర్య‌ట‌న‌ను అడ్డ‌కున్న వైసిపి కార్య‌క‌ర్త‌లు
స్పందించిన పోలీసులు.. అక్క‌డ నుంచి త‌రిమివేత

(ఆంధ్రప్రభ , వేంపల్లి / కడప) ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల రెడ్డి తన సొంత గడ్డ పులివెందులలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మూడు రోజుల విరామం అనంతరం శుక్రవారం వైఎస్ వివేకానంద రెడ్డి తనయ సునీత రెడ్డి వెంట రాగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభమైంది. వేంపల్లి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇది నా సొంత గడ్డ. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డిని ఆశీర్వదించిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న. నేను మీ బిడ్డను. మీ ఇంటి ఆడపడుచును. వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌స‌బ‌ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి అని షర్మిలా చేతులెత్తి నమప్కరించారు.


చిన్నాన్న‌ను దారుణంగా చంపేశారు..

మా చిన్నాన్న వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన వాళ్లు ఎవరు?.. చేయించింది ఎవరు?.. మీకు తెలుసు. హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా నిందితులకు ఎటువంటి శిక్షలు పడలేదు. దర్జాగా తిరుగుతున్నారు. వారిని ఎవరు కాపాడుతున్నారో మీకు తెలుసు. ప్రజలు ఓట్లు వేస్తే కనీసం కృతజ్ఞత లేదు. జగన్‌కు ఓట్లు వేసి గెలిపించేది హత్యలు చేయించడానికా? అని ష‌ర్మిల‌ ప్రశ్నించారు. ఇక్కడే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.

అభివృద్ధి లేదు.. అక్రమార్జనే

- Advertisement -

రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అన్నది లేదు. ప్రత్యేక హోదా లేదు.. పోలవరం పూర్తి కాలేదు.. కడప స్టీల్ ఫ్యాక్టరీ అతి గతి లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తూ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. చిన్నాన్న వివేకను హత్య చేసిన నిందితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారన్నారు. వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవని చెప్పారు. సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడని చెప్పిందని మరీ చర్యలేందుకు తీసుకోలేదని నిలదీశారు.అలాంటి వ్యక్తికే ఈ ఎన్నికల్లో మళ్లీ జగన్ టిక్కెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇది హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్లేనని చెప్పారు. హత్య చేసిన నిందితులను గెలిపించాలని జగన్ చూస్తున్నారన్నారు. వివేకా స్వయానా జగన్‌కి బాబాయి అవుతారని.. ఈ హత్యపై కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదని వైఎస్ షర్మిలా మండిపడ్డారు.

మీ రాజన్న బిడ్డను గెలిపించండి

నిందితులను దగ్గరుండి మరీ కాపాడుతున్నారని, ఇలాంటి నిందితులు చట్టసభల్లో అడుగుపెట్టవద్దని అన్నారు. సునీతాకు తాను అండగా నిలబడ్డానని చెప్పారు. అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కడప స్థానం నుంచి పోటీ చేస్తున్నాను. న్యాయం ఒకవైపు, అధర్మం ఒక వైపు ఉందన్నారు. వైఎస్ బిడ్డ ఒక వైపు ..వివేకాను హత్య చేసిన నిందితుడు ఇంకొవైపు ఉన్నారని చెప్పారు. ఒకవైపు ధర్మం, మరో వైపు అధికారం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచించాలని వైఎస్ షర్మిల అన్నారు. మీ ఆడబిడ్డను. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆశీర్వదించండి. మీ రాజన్న బిడ్డను గెలిపించండి అంటూ నియోజకవర్గ ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు.

వీళ్లు చట్టసభలకు వెళ్లకూడదు: సునీత

వివేకానంద రెడ్డి తనయ సునీత రెడ్డి మాట్లాడుతూ.. నాన్న వివేకానంద రెడ్డి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు మరోసారి చట్ట సభలకు వెళ్లకూడదన్నారు. అకారాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి శిక్షలు అనుభవించకుండా సమాజంలో దర్జాగా తిరుగుతున్నారని అటువంటి వారిని, వారికి మద్దతు ఇచ్చే వారిని కూడా ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ మీడియా చైర్మన్ ఎన్ తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం పులివెందుల నియోజక వర్గంలోని వేముల, సింహాద్రిపురం, పులివెందుల మీదుగా సాగుతోంది. పులివెందుల ప్రజల నుంచి ఆమె ఒక మంచి స్పందన లభిస్తోంది.

లింగాల మండల కేంద్రంలో ఉద్రిక్తత

షర్మిల పర్యటన లింగాల మండ‌లం చేరుకున్న సంద‌ర్భంగా కొంద‌రు వైసిపి కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.. ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. స‌కాలంలో స్పందించిన పోలీసులు వారిని అక్క‌డ నుంచి త‌రిమివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement