Friday, May 3, 2024

చేతివాటంతో ప‌న్నుల ఎగ‌వేత‌దారులు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖల్లో వాణిజ్యపన్నుల శాఖ పాత్ర ముందుంటుంది. ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయంలో దాదాపుగా 30 శాతం వాణిజ్య పన్నుల శాఖ ద్వారానే అందుతుంది. ఇంత కీలమైన శాఖలో కొంత మంది అధికారులు ఆశించినస్థాయిలో పనిచేయలేక పోతున్నారు. ఫలితంగా కొన్ని లక్ష్యాలను ఛేధించడంలో ఆ శాఖ వెనుకబడిపోతుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో రూ.614.46 కోట్లు పన్ను ఎగవేతకు గురైనట్లు సంబంధిత శాఖ అధికారులు గుర్తించారు. ఆదిశగా 291 కేసులు నమోదు కూడా చేశారు. అయితే, రికవరీ విషయంలో మాత్రం కేవలం రూ. 22.24 కోట్లు మాత్రమే పన్ను ఎగవేత దారుల నుండి వసూలు చేశారు. దీనినిబట్టి చూస్తుంటే రాష్ట్రంలో పన్ను ఎగవేత దారులు చేజారిపోతున్నారు. గుర్తించిన అధికారులు వారి నుండి పన్ను వసూలు చేయడంలో విఫలమౌతున్నారా..లేక పథకం ప్రకారమే జాప్యం చేస్తున్నారా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఎగవేత వసూళ్ల లక్ష్యాల్లోనూ, ఇతర సేవల్లోనూ ఆశించిన ఫలితాలను అందుకోలేక పోయింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ వసూళ్ల లక్ష్యాలు రూ. 60,191.27 కోట్లుగా నిర్ణయించారు. వార్షిక లక్ష్యాలకు దగ్గరగా వసూలు చేస్తున్నప్పటికీ పన్ను ఎగవేత విషయంలోనూ శాఖ పరిధిలోని ఇతర సేవలను వ్యాపారులకు అందించడంలోనూ అనేక జిల్లాల్లో వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారవర్గాల నుండి కూడా ఇదే అంశంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వ్యాపారాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడంలోనూ వివిధ పత్రాలు జారీ చేయడంలోనూ కొంత మంది అధికారులు మామూళ్లకు అలవాటుపడి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేసులు నమోదు చేశారు .. రికవరీ మరిచారు
రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపార వర్గాలు రూ.614 కోట్లకుపైగా పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఆదిశగా 291 కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేయడంలో వ్యాపారులను భయపెట్టడంలోనూ ముందుంటున్న అధికారులు ఎగవేతకు గురైన పన్నును నూటికి నూరు శాతం వసూలు చేయడంలో మాత్రం దృష్టి సారించడం లేదు. ఫలితంగానే గత ఏడాది పన్ను ఎగవేత విషయంలో ఐదు శాతం కూడా రికవరీ చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌ వస్తు సేవల చట్టం 2017 రూల్‌ 2017 సెక్షన్‌ 67, 127,130 ప్రకారం రవాణాలో ఉన్న వస్తువులకు సరైన పత్రాలు లేకపోతే ఆయా సరుకులను నిర్భంధించడంతోపాటు సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదుచేసి సంబంధిత వస్తు విలువ ఆధారంగా పన్నును వసూలుచేసే అధికారం వాణిజ్యపన్నుల శాఖకు ఉంది. గతంతో పోలిస్తే 2017 తరువాత ఈ చట్టాలను మరింత కఠినత్వం చేయడంతోపాటు సర్వాధికారాలను ఆశాఖకు ప్రభుత్వం అప్పగించింది. అయినా కేసుల నమోదులో చూపిస్తున్న చొరవ పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడంలోనూ అక్రమ రవాణాలో పట్టుబడిన వస్తువ విలువ ఆధారంగా సొమ్మను రికవరీ చేయడంలోనూ ఆశాఖ అధికారులు అనేక సందర్భాల్లో విఫలమవుతున్నారు. ఫలితంగానే రికవరీలో వెనుకబడిపోతున్న అధికారులు కేసుల నమోదుకే పరిమితమవుతున్నారన్న అపవాదు వెంటాడుతుంది.


ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ఒ బిజినెస్‌లోనూ వెనుకడుగు
వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో వివిధ వ్యాపారాలను మరింత సులభాంతరం చేసే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో కొన్ని సంస్కరణలను కూడా తీసుకొచ్చింది. ఈనూతన కార్యాచరణను పక్కా ప్రణాళికతో అమలు చేయాలని సూచించింది. అందులో భాగంగానే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఈప్రక్రియ ద్వారా వ్యాపారస్తులకు సంబంధిత సేవలను మరింత తక్కువ సమయంలో సులభతరంగా అందించాలనేది లక్ష్యం. అయితే ఈప్రక్రియలో కొన్ని జిల్లాల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారాన్ని ప్రారంభించే ఏ వ్యక్తయినా పాన్‌ కార్డు, మొబైల్‌ నంబరు, ఈమెయిల్‌ వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను దరఖాస్తులో తెలియపరిస్తే తక్షణమే సంబంధిత వ్యాపారానికి సంబంధించి ఆర్సీ జారీ చేయాలి. గతంలో ఏడు రోజుల కంటే ఎక్కువ రోజులు సమయం పట్టడం, కొన్ని ప్రాంతాల్లో మరింత జాప్యం జరుగుతుండటాన్ని గుర్తించిన ప్రభుత్వం పై విధానాన్ని తీసుకొచ్చింది. కొన్ని జిల్లాల్లో కొంత మంది అధికారులు ఈ ప్రక్రియలో పూర్తిగా వెనుకబడిపోతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.


కొన్ని సేవల్లో చేతి వాటం
వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అతిముఖ్యమైనవి వస్తు ఆధారిత పన్ను చట్టం, వినోదపు పన్ను, వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధులపై పన్ను, గుర్రపు పందేలా, జూదం తదితర అంశాలపై పన్ను ఇలా అనేక అంశాలపై పన్నులు విధించడంతోపాటు సేవలను కూడా సకాలంలో సంబంధిత వర్గాలకు అందించాలి. పన్నులు విధించడంలోనూ అందుకు సంబంధించి అనుమతులు ఇవ్వడంలోనూ కొంత మంది అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు వ్యాపార వర్గాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది అధికారులైతే నెలమామూళ్లు తీసుకుంటూ కొంత మంది దొంగ వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement