Saturday, April 27, 2024

అంగన్​వాడీ స్కూల్లో కలెక్టర్​ కొడుకు.. గ్రేట్​ అంటూ అభినందనలు

కూలి, నాలి చేసే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కార్పొరేట్ స్థాయి స్కూళ్లో చదివించాలని ఆశ పడుతున్న రోజులివి. కానీ ఓ జిల్లాకు కలెక్టర్​ అయి ఉండి కూడా తను సామాన్యుడిలా ఆలోచించారు. అతని తీరును చూసి ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు. అభినందిస్తున్నారు. అదేంటో ఈ వార్త చదవి తెలుసుకుందాం..

అన్నీ ఉండి సామాన్యుడి తరహాలో అంగన్​వాడి స్కూళ్లో తన కుమారుడిని చేర్పించారు కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు. శుక్రవారం తన కుమారుడు దివి ఆర్విన్ ను కర్నూలు నగరం లోని బుధవారపేట అంగన్​వాడీ ప్రీ స్కూల్ లో చేర్పించారు. అయితే.. బాబు దివి ఆర్విన్  అంగన్​వాడీ కేంద్రంలోని పిల్లలతో కూర్చుని  రంగులు దిద్దుకుంటూ, ఆట వస్తువులతో ఆడుకుంటున్న దృశ్యాలు అందరినీ అలరించాయి. కార్పొరేట్ పాఠశాలల్లో కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న  అనే అక్షర సత్యాన్ని కలెక్టర్ గుర్తించారు. మెరుగైన బోధన కోసం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులను గురించి కలెక్టర్ సమావేశాల్లో తరచూ అధికారులతో చెప్తుంటారు . 

అంగన్వాడి ప్రీ స్కూల్ లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడంతో పాటు విలువలను కూడా నేర్పించాలని ఇటీవల జరిగిన మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలెక్టర్​ కోటేశ్వరరావు. అంగన్వాడీ కేంద్రాల్లో శిశువులకు  ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ తన కుమారుడిని బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. స్వతహాగానే కలెక్టర్ కోటేశ్వర రావు ఆర్భాటాలకు దూరంగా, నిరాడంబరంగా ఉంటారు . ఈ చర్యతో  అది మరింతగా నిరూపితం అయ్యిందంటున్నారు జనాలు. అందరికీ చెప్పడమే కాకుండా తన చేతల్లోనూ చూపించి, కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement