Thursday, May 2, 2024

చంద్రబాబు పర్యటన రక్తసిక్తం – వైసిపి, టిడిపి కార్య‌క‌ర్త‌ల బాహబాహీ.. రాళ్ల దాడి.. పోలీస్ వాహనాల‌కు నిప్పు…టీయర్ గ్రాస్ ప్రయోగం – వీడియోతో

పుంగ‌నూరు – టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల పరస్పర గొడవకు దిగడంతో అంగళ్లు దగ్గర హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చింపేయడం, ఆతర్వాత జరిగిన గొడవల్లో టీడీపీ ఎంపీటీసీ దేవేందర్ గాయపడ్డాడు.

పోలీసులు సర్దిచెప్పినా రెండు వర్గాలు వినకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ల‌దాడి త‌ర్వాత వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. రెండు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. ఘర్షణను నివారించేందుకు ముందుగా లాఠీ చార్జీ చేశారు.. అదుపులోకి రాకపోవడంతో భాష్ఫ వాయువుని ప్రయోగించారు.. అయినప్పటికీ ఇరు వ‌ర్గాలు రెచ్చిపోయి దాడులు చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంట్రీ మొదలు చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం కూడా ఇలాంటి హైటెన్షన్‌ వాతావరణం కనిపించింది. మొదట పుంగనూరు మీదుగా చంద్రబాబు సోంపల్లి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాల్సి ఉంది. అయితే గో బ్యాక్ చంద్రబాబు నినాదాలతో రోడ్డుపైకి వచ్చారు వైసీపీ కార్యకర్తలు. మొదట మొలకల చెరువు వద్ద భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

అదే సమయంలో అక్కడ మోహరించిన వైసీపీ శ్రేణులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ శ్రేణులకు పోటీగా టీడీపీ శ్రేణులు మోహరించడంతో ఉద్రిక్తత ఎక్కువైంది. పోలీసులు సర్దిచెప్పినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. మరోవైపు పుంగనూరులోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించింది వైసీపీ. దీంతో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఇప్పటికే పుంగనూరులో భారీగా మోహరించారు పోలీసులు.

ఇక అక్క‌డి నుంచి బ‌య‌లు దేరిన చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు అంగుళ్ల చేరుకుంది. అక్క‌డ వైసిపి శ్రేణులు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను ముందుకు సాగ‌కుండా అడ్డుకున్నారు.. టిడిపి ఫ్లెక్సీలు, జండాలు పీకివేశారు.. టిడిపి శ్రేణులు వారిని నిల‌వ‌రించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో వైసీపీ కార్యకర్తలు రాళ్ల‌దాడికి దిగారు.. వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ అధినేత మండిపడ్డారు. గాయపడిన కార్యకర్తలకు వెంటనే చికిత్స చేయించాలని పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు.
ఈ సందర్భంగా అంగళ్లులో మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. దాక్కోవడం కాదు, దమ్ముంటే రమ్మని పిలిస్తున్నానంటూ సవాల్‌ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement