Monday, April 29, 2024

AP: లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

విశాఖ పట్నం… ఆంధ్ర ప్రభ బ్యూరో : అనకాపల్లి నుంచి ఆనందపురం వెళుతున్న ఆరు లైన్ల జాతీయ రహదారిలో పెందుర్తి ప్రాంతం వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యానాంకు చెందిన ఐదుగురు యువకులు అతిగా మద్యం సేవిస్తూ మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేస్తూ ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ సంఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మృతిచెందగా అందులో ప్రయాణిస్తున్న మరో నలుగురు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే పెందుర్తి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను వెంటనే కేజీహెచ్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

యానాం ప్రాంతానికి చెందిన రేవు పవన్ కుమార్ (27), గేడ్డం సురేష్ (18), యు.రాజ్ కుమార్ (28), దొమ్మేటి సూర్య భగవాన్(27), వేలంగి సాయి కృష్ణ(28) ఐదుగురు యువకులు సోమవారం మధ్యాహ్నం స్విఫ్ట్ డిజైర్ కారులో విశాఖపట్నంకు బయలుదేరారు. మార్గమధ్యలో అక్కడక్కడ ఆగుతూ మద్యం సేవిస్తూ వస్తున్నారు. అరకు వెళ్దాం అనుకుని బయలుదేరిన వీళ్లు అనకాపల్లిలో బీర్లు కొనుక్కొని అనకాపల్లి నుంచి ఆనందపురం వచ్చే ఆరు లైన్ల రహదారిలో ప్రయాణించారు. అదే రోడ్డులో నెమ్మదిగా వెళ్తున్న ఓ లారీని మితిమీరిన వేగంతో వెళుతూ వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. దీంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న దొమ్మేటి సూర్య భగవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మిగతా నలుగురు తీవ్రగాయాల పాలై తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందగానే ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ తన బృందంతో కలిసి అక్కడికి వెళ్లారు. క్షతగాత్రులను హుటాహుటిన కేజీహెచ్ కు తరలించారు. ఈ నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని, తాగేసిన బీరు బాటిళ్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో శృతిమించి వాహనాన్ని డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement