Monday, April 29, 2024

Capital City – వెయ్యి కోట్ల‌తో స్మార్ట్ గా విశాఖ …

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత విశాఖకు అనేక కొత్త ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. తాజాగా ఐటి అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం మరోవైపు పర్యాటక ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోంది. ఇటీవలే నగరంలోని అక్కయ్యపాలెం పోర్టు ఆసుపత్రి వెనుక భాగంలో రహేజా సంస్థ ప్రారంభించింది. ఇక ఇన్ఫోసిస్‌ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ రెండు సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే ప్రారంభించారు. మరో వైపు సుమారు రూ.1000కోట్లతో దశల వారీగా చేపట్టిన స్మార్ట్‌ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.800 కోట్లతో 54 ప్రాజెక్టులు పూర్తి చేయగలిగారు. దేశవ్యాప్తంగా తొలివి డత ఎంపిక చేసిన 20 ఆకర్షణీయ నగరాల్లో విశాఖ తొలిదశలోనే చోటు దక్కించుకుంది. దీంతో ఐదేళ్ల కాలానికి రూ.500 కోట్లను కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తుండగా, మరో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద సమకూర్చుతుంది. ఇప్పటి వరకు సుమారు రూ.600 కోట్లు చెల్లింపులు పూర్తి కావచ్చాయి.

54 స్మార్ట్‌ ప్రాజెక్టుల్లో పురాతన, చారిత్రాత్మక భవనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పాత మున్సిపల్‌ కార్యాలయం, టౌన్‌హాల్‌ ఆధునీకరించారు. అలాగే జగదాంబ జంక్షన్‌లో మల్టిdలెవెల్‌ కారు పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. వీటితోపాటు ముడసర్లోవ, మేఘాద్రి జలాశయాలపై నీటిపై తేలియాడే సోలార్‌ పవర్‌ప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. ఇక జీవీఎంసీకి చెందిన సుమారు 89 పాఠశాలల్లో సోలార్‌ ప్రాజెక్టులు పనులు పూర్తి చేశారు. డిజిటల్‌ తరగతులు చేపట్టారు. వీటితో పాటు బీచ్‌రోడ్డులో రుషికొండ వరకు సాగరతీరానికి మెరుగులు దిద్దారు. మరోవైపు ఎంవీపీ కాలనీలో స్పోర్ట్స్‌ ఏరీనాను ప్రారంభించారు. ఇక విఎంఆర్‌డీఎ ఆధ్వర్యంలో వుడా పార్కును సుమారు రూ.30 కోట్లతో ఆధునీకరించారు.
ఇక దేశంలోనే దివ్యాంగుల పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలుతో ఆల్‌ ఎబిలిటీస్‌ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కుకు జాతీయ స్థాయిలో అవార్డు వరించింది. అలాగే మల్కాపురం, పెందుర్తి పారిశ్రామిక ప్రాంతాల్లో టాటా సంస్థ ద్వారా ప్రతిష్టాత్మకమైన మురుగునీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చే ప్రాజెక్టును రెండు దశల కింద పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.854 కోట్లతో అంచనాలు తయారు చేసి ఇప్పటికే తొలివిడత పనులు పూర్తి చేశారు. ఇందు కోసం బ్యాంకు రుణం తీసుకున్నారు. కొంతమేరకు స్మార్ట్‌ సిటీ నిధులు కేటాయించారు. ఇక జీవీఎంసీ కూడా ఇప్పటికే మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద రూ.150 కోట్లు కేటాయించింది. దీంతో ఈ ప్రాజెక్టు తొలివిడత పనులు పూర్తికాగా రెండో విడత పనులు కోసం నిధులు సమకూరుస్తున్నారు. ఇంకోవైపు పార్కుల అభివృద్ధి చేపట్టారు.

నగరంలో ప్రధాన రహదారులను ఈ స్ట్రీట్స్‌గా మార్పు చేశారు. నగరంలో సుమారు 34 మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. నగరమంతా అద్దంలా తీర్చిదిద్దుతున్నారు. ఇక విశాఖ నుంచి బోగాపురం వరకు నాలుగు లైన్ల కారిడార్‌ను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు మరింత సులభతరం చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల కోసం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ నిధులు, ఏడీబి, బ్యాంకు రుణాలు, జీవీఎంసీ , 15వ ఆర్ధిక సంఘం నిధులతో పనులు పూర్తి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రుషికొండ వేదికగా ప్రారంభించనుండడంతో అటువైపు అత్యధిక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. భద్రతాపరంగా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా రుషికొండ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడకు సమీపంలోనే ఐటీ హిల్స్‌ ఉండడం, పలు సంస్థల కార్యకలాపాలు అక్కడ నుంచే నిర్వహిస్తుండడంతో ఆ ప్రాంతమంతా సువిశాలంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement