Monday, April 29, 2024

లే ఔట్ల వద్దనే బ్రిక్‌ యూనిట్లు, లబ్ధిదారులపై భారం పడకుండా నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ: పేదలకు ఇళ్లు నిర్మించే ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకంలో మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రెండు దశల్లో దాదాపు 30 లక్షలకుపైగా ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలి దశలో 15.60 లక్షల ఇళ్లు కట్టివ్వాలని నిర్ణయించారు. అందుకోసం జూన్‌ నెలాఖరు టార్గెట్‌గా నిర్దేశించుకున్నారు. అయితే లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ‘ఆప్షన్‌- 3’ మినహా మిగతా ఆప్షన్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ఇటుకల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లోని ఇటుక బట్టీల నుంచి కొనుగోలు చేసి, లే ఔట్ల వద్దకు తరలించడానికి ఖర్చు పెరుగుతోంది. ఈ ఇబ్బందులను గుర్తించిన గృహనిర్మాణ శాఖ లే ఔట్లకు సమీపంలోనే బ్రిక్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సిమెంట్‌, ఐరన్‌ నిల్వ చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా గోడౌన్లను ఏర్పాటు చేస్తోంది.

గోడౌన్లలో సరుకు ఉంచడం ద్వారాఆ లే ఔట్ల వద్దకు తేలిగ్గా సరుకును తరలించడం సాధ్యమవుతుంది. అలాగే వర్షం, మంచు, ఎండ వల్ల సామగ్రి పాడవకుండా భద్రంగా ఉంటుంది. అదే తరహాలో ఇటుకల విషయంలో కూడా లబ్ధిదారులకు ఎదురవుతున్న వ్యయప్రయాసలను తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పనులు జరుగుతున్న లే ఔట్ల వద్ద బ్రిక్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. గృహ నిర్మాణ పనులు జరుగుతున్న లే ఔట్ల వద్ద బ్రిక్‌ యూనిట్ల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 13 జిల్లాల్లో 176 యూనిట్లు ఏర్పాటయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 31 యూనిట్లు ఏర్పాటు కాగా.. అనంతపురము జిల్లాలో ఒక్క యూనిట్‌ ఏర్పాటైంది. శ్రీకాకుళం, విజయనగరం పది చొప్పున, విశాఖపట్నంలో 20, తూర్పు గోదావరిలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 30 బ్రిక్‌ యూనిట్లు సిద్ధమయ్యాయి. అలాగే కృష్ణా జిల్లాలో 8, ప్రకాశంలో 19, నెల్లూరులో 4, చిత్తూరు జిల్లాలో 9, కడపలో 6, కర్నూలు జిల్లాలో 22 బ్రిక్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఈ యూనిట్ల స్థాయిని బట్టి, సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాలో 8 వేల నుంచి 60 వేల వరకు ఇటుకలు అందుబాటులో ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కెపాసిటీ 4 లక్షల 14 వేలుగా ఉంది.

అధికారులపై స్పెషల్‌ సీఎస్‌ ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్షల్లో స్పష్టం చేస్తుంటే.. కొన్ని చోట్ల మందకొడిగా జరుగుతున్నాయని, నిర్దేశిత స్పీడ్‌ అందుకోలేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్‌ సీఎస్‌ నిర్వహించే రోజువారీ సమీక్షల్లో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఈ నేపథ్యంలో తొలి దశ పనులు జూన్‌ నాటికి పూర్తి కావాలని స్పష్టం చేస్తున్నారు. అందుకోసం అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో ఏ దశకు ఆ దశలో నిధులను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని జిల్లాల్లో ఇళ్ల పనులు నిర్దేశిత దశకు చేరుకున్నప్పటికీ.. వాటికి సంబంధించిన బిల్లులు సిద్ధం కాలేదు. బిల్లుల విషయంలో జాప్యం జరగడంపై స్పెషల్‌ సీఎస్‌ సీరియస్‌ అయినట్లు సమాచారం. కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి సమృద్ధిగా నిధులు వస్తుంటే.. బిల్లులు త్వరితగతిన సిద్ధం చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నిలదీసినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement