Monday, April 29, 2024

Big Story: డర్టీ పార్లర్స్.. నకిలీ కాస్మెటిక్స్‌.. బ్యూటీ పేరుతో న‌యా దోపిడీ..

ప్రభన్యూస్‌బ్యూరో, ఒంగోలుః ఒకప్పుడు అతివలకు మాత్రమే ముఖారవిందం..కేశాలంకరణపై మోజు ఉండేది. కానీ మారుతున్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. చిన్నా, పెద్ద తేడా లేకుండా బ్యూటీ లుక్‌ పై పరితపించిపోతున్నారు. గతంలో అందం కోసం ప్రకృతి సిద్దమైన విధానాలు పాటించేవారు. ముఖానికి పసుపు పూసుకునే వారు. తలకు కుంకుడు కాయల రసం వాడేవారు. ఇవీ పూర్తిగా రక్షణాత్మకం. కానీ, హైటెక్‌ యుగంలో పసుపు, కుంకుడు కాయలకు చెల్లుచీటి పడింది. వివిధ క్రీములు, షాంపూలు పూసేసుకుంటున్నారు. సహజాత్వాన్ని వీడి కృత్రిక అందం కోసం తెగ ఆరాటపడుతున్నారు. ముఖంపై కాస్త మచ్చ కనిపిస్తే చాలు.. బ్యూటీ పార్లర్లకు పరుగులు పెడుతున్నారు. నగరంలో ఈ బ్యూటీ పార్లర్లు పుట్టగొడుగుటల్లా పుట్టుకొస్తున్నాయి. జెంట్స్‌, లేడీస్‌ అంటూ వేర్వేరు పార్లర్లు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. సెలూన్లు హైటెక్‌ హంగులను అద్దుకొని బ్యూటీ పార్లర్లగా మారుతున్నాయి. ఈ బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకు నిపుణత ఉందా లేదా అనేది కూడా జనానికి పట్టడం లేదు. ఫ్యాషన్‌గా పార్లర్లకు వెళ్లడమే తరువాయిగా మారింది.

ఫేస్‌ బ్లీచ్‌, ఫేషీయల్‌ చేయడంలో ఎంతో నిపుణత అవసరం. ముఖ్యంగా ఫేస్‌ బ్లీచ్‌ చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ముఖం నల్లగా మారుతుంది. ఒక్కో సారి కాలిపోతుంది కూడా! బ్లీచ్‌ చేయడానికి వాడే క్రీమ్‌లో అమోనియా కలుపుతారు. అమోనియా యాక్టివేటర్‌ ఎంత అనేదే ప్రధానం. అమోనియా ఒక్క డ్రాప్‌ ఎక్కువ పడినా ముఖ చర్మం కాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ చర్మం పై వెంటనే దద్దులు వస్తాయి. బ్లీచ్‌ వేసిన తరువాత 10 నుంచి 15 నిమిషాల లోపే తీసి వేయాలి. అంత కంటే ఎక్కువ సమయం ఉంచినా ప్రమాదకరమే!

యూత్‌ నుంచి మధ్య వయస్సు పైబడిన వారందరూ ముఖ , కేశాలంకరణ పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో నగరంతో పాటు, జిల్లాలోని పట్టణాల్లో బ్యూటీ పార్లర్లకు క్రేజ్‌ పెరిగింది. అందం పై పెరిగిన ఆశలు పార్లర్‌ నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట పని చేసిన కాసింత అనుభవం, సోషల్‌ మీడియాలో అలంకార అందాలను చూసి మిడి మిడి నైపుణ్యతతో వెంటనే బ్యూటీ పార్లర్ల పెట్టేస్తున్నారు. పార్లర్లలోని హంగామా, ఇంటీరియల్‌ డేకరేషన్‌, ఏసీలు, ఖరీదైనా సోఫాలు, సీటింగ్‌ ఇలా.. హై ఫై లుక్‌ను చూసి జనం అక్కడికి వెళ్లడమే గొప్పగా భావిస్తున్నారు. వాస్తవానికి 25 ఏళ్ల లోపు వారు ఫేస్‌బ్లీచ్‌ చేయించుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. కానీ యువత నెల లో కనీసం రెండు సార్లు అయినా ఫేస్‌బ్లీచ్‌ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఫేస్‌ బ్లీచ్‌ వల్ల ప్రస్తుతం ముఖ చర్మం ప్రకాశంతంగానే కనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ప్రతికూలతలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నగరం, పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న సెలూన్లలోనూ ఫేస్‌బ్లీచ్‌ చేసేస్తుండటం గమనార్హం. దీంతో బ్యూటీ పార్లర్లకు సెలూన్లకు తేడా లేకుండా పోయింది. అసలు ట్రెండ్‌ మారింది..సెలూన్‌ స్థానంలో బోర్డుల పై బ్యూటీ పార్లర్‌ అని రాసేస్తున్నారు. నైపుణ్యం, అనుభవం ఉండదు. కాసింత అనుభవం ఉన్న యజమాని పనివారికి మెళుకువలు నేర్పించి కస్టమర్లకు ఫేస్‌బ్లీచ్‌, ఫేషియల్‌, కేశాలకు రంగులు, కెమికల్స్‌ అద్దడం వంటివి చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిసినా అటు నిర్వాహకులు, ఇటు జనం పట్టించుకోవడం లేదు.

అజమాయిషీ ఎవరిది..?
బ్యూటీ పార్లర్ల నిర్వహణ పై అజమాయిషీ ఎవరిది..? ఏ శాఖ నియంత్రణలో ఇది పని చేస్తాయి..?వీటిని తనిఖీ చేసే అధికారులు ఎవరు..? అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు కరువయ్యాయి. కాస్మోటిక్స్‌యాక్ట్‌ ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బ్యూటీ పార్లర్లను తనిఖీలు చేయాల్సి ఉన్నా.. వారికి ఈ విషయం తెలియక పోవడం గమనార్హం. నగరపాలక సంస్థ ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ నగరంలో అలాంటివి ఉన్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనధికారికంగానే బ్యూటీ పార్లర్లు నిర్వహించేస్తున్నారు.

మార్కెట్లోకి నకిలీ కాస్మోటిక్స్‌ !
బ్యూటీ పై జనానికి ఉన్న మోజుతో నకిలీ కాస్మోటిక్స్‌ మార్కెట్లో చలామణి అవుతున్నాయి. బ్యూటీ పార్లర్లు, సెలూన్లలో వాడుతున్న కాస్మోటిక్స్‌లో కెమికల్స్‌ అత్యధికంగా ఉంటున్నాయి. అందులో నకిలీవే ఎక్కువగా ఉంటున్నాయని సమాచారం. ఇది తెలియక జనం బ్యూటీ మోజులో సెలూన్లకు వెళ్తుండటంతో..దీనినే అదునుగా చేసుకుని నిర్వాహకులు వినియోగిస్తూ అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement