Saturday, November 9, 2024

Big Story: మధ్యంతర భృతే ఫిట్‌మెంట్‌గా.. మహా అయితే తెలంగాణలో ఇచ్చినట్టు 30శాతానికి చాన్స్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంఘాలు సహకరించని పక్షంలో, ప్రస్తుతం ఉద్యోగులకు ఇస్తున్న 27శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌)నే ప్రభుత్వం ఫిట్‌మెంట్‌గా ప్రకటించే అవకాశమున్నట్లు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులంతా తమ వారేనని, వారి ఇబ్బందులు తమ ఇబ్బందులేనని స్పష్టంగా చెప్పిన సీఎం జగన్‌ ఆమేరకు నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. కాకపోతే దీనిపై కూడా ఉద్యోగ సంఘాలు మంకుపట్టుపడితే మాత్రం తెలంగాణలో ఇచ్చిన ప్రకారమే 30 శాతం ఇచ్చేందుకు సీఎం అంగీకరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే పీఆర్సీ 2018 నుంచే అమలు చేయాలన్న డిమాండ్‌ను ఉద్యోగ సంఘాలు సడలించే షరతు పెట్టనున్నట్లు తెలిసింది. దీనిని 2022 ఏప్రిల్‌ నుంచి అమలు చేసి పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు ఒప్పిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ అగాధం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. పీఆర్సీ ఇవ్వాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా చేస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రాకుంటే ఉద్యోగ బాట వదిలి ఉద్యమ బాట పట్టేందుకు ఉద్యోగులు వెనకాడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డిలతో జరిగిన సమావేశాలు ఫలప్రదం కాకపోవడంతో ఇప్పుడు సమస్య మరింత జఠిలమైంది. ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 14.29 శాతానికి ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి. తాము కోరిన విధంగా 55శాతం ఇవ్వాల్సిందేనని పట్టుబడు తున్నాయి. మధ్యే మార్గంగా కనీసం 34 శాతమైనా ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా ఉద్యోగుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి నేరుగా ఈ అంశంలో జోక్యం చేసుకోకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జోక్యంతో తమకు స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఉద్యోగ బాట నుండి ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు.

పీఆర్సీ రిపోర్ట్‌పై ఉద్యోగుల గుర్రు
అధికారంలోకి వస్తే పీఆర్సీ ఇస్తామని గతంలో జగన్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే రెండున్నరేళ్ల తర్వాత 14.29శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించేసరికి ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో నిన్న మొన్నటి వరకూ 46శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే చెప్పిన ఉద్యోగ సంఘాలు కాస్తా ఇప్పుడు 55 శాతం ఇవ్వాల్సిందేనంటు- పట్టుబడుతున్నాయి. అధికారుల కమిటీ- సిఫార్సు చేసిన 14.29 ఫిట్‌ మెంట్‌ ఇచ్చేందుకే తంటాలు పడుతున్న ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్‌ ఇబ్బందికరంగా మారింది.

రెండో రోజు బుగ్గనతో చర్చలూ విఫలమే
మంత్రి బుగ్గన వద్ద రెండో రోజు కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 45 శాతం పీఆర్సీ ఇచ్చే అవకాశం లేదని మంత్రి తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 30 శాతం పీఆర్సీ అమలు చేస్తుండటంతో..అంత కంటే ఎక్కువగా సీఎం జగన్‌ ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్‌తో బుధవారం ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ఉంటు-ందని ప్రచారం సాగింది. అయితే, అనూహ్యంగా ఆర్ధిక శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు- చేసారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున బుగ్గన మరోసారి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ని వివరించే ప్రయత్నమే చేశారుతప్పితే ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీని ఇవ్వలేకపోయారు. అయితే, ఉద్యోగ సంఘాల స్పందన చూసిన తరువాత బుగ్గన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రికి వివరించనున్నారని తెలిసింది.

నేడు మళ్లి చర్చలు
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం బుధవారం జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. వరుసగా రెండవరోజు కూడా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. దీంతో గురువారం ముచ్చటగా మూడోసారి పీఆర్‌సీపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. బుధవారం సుదీర్ఘంగా ఆరు గంటలకు పైగా జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు పీఆర్‌సీ సహా 71 డిమాండ్‌లపై చర్చించారు. అయితే ఉద్యోగ సంఘాలు 50 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి తీరాల్సిందేనని మరోసారి పట్టుబట్టాయి. ప్రభుత్వం మాత్రం సీఎస్‌ కమిటీ సూచించిన 14.29 శాతానికి ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నం చేశాయి. అయితే భేటీకి హాజరైన కొన్ని ఉద్యోగ సంఘాలు కనీసం 34 శాతం ఫిట్‌మెంట్‌ అయినా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గురువారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.అంతకు ముందు సమావేశానికి జేఏసీ, ఏపీ జేఏసీ, అమరావతి సంఘ నాయకులు నల్లబ్యాడ్జీలతో హాజరై తమ నిరసనను తెలియపరిచారు.

- Advertisement -

అన్ని అంశాలపై చర్చలు జరిగాయి: సజ్జల రామకృష్ణారెడ్డి
పీఆర్‌సీ చర్చల్లో భాగంగా అన్ని అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగాయని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ సమావేశంలో జరిగిన అంశాలను వివరించారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు వారి అభిప్రాయాలను చెప్పారన్నారు. సుమారు 3 లక్షల మందికి 70 శాతం పైగా జీతాలు పెంచామని, రూ.1300 కోట్లు ఇప్పటికే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడిందని ఆయన వివరించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, గ్రామ, వార్డు సచివాలయాల నియామకాలతో ప్రభుత్వంపై మరింత భారం పడిందన్నారు. వీటితో పాటు కోవిడ్‌ మరెన్ని ఆర్ధిక ఇబ్బందులను తెచ్చి పెట్టిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement