Friday, April 26, 2024

సర్కార్‌ పెద్దల తీరుపై రగిలిపోతున్న ‘భీమసింగి’ రైతులు

విజయనగరం : వంచన పంచన ఎన్నాళ్లిలా మగ్గిపోవాలంటూ ఇటు భీమసింగి చక్కెర కర్మాగారంలోని చెరకు రైతులు.. అటు కార్మికులు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్‌ పెద్దల తీరుపై తీవ్రంగా రగిలిపోతున్నారు. ఆధునీకరణ పేరు చెప్పి కొన్నాళ్లు మూసేసి ఆపైన శాశ్వ‌తంగా మూసేయాలన్న కుట్రలు చేయడం తగదని మండిపడుతున్నారు. కొత్త పరిశ్రమలు ఎటూ తేలేకపోగా అందుబాటులో వున్న పరిశ్రమలు మూసివేస్తామనడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సహకార రంగాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప బలోపేతం చేసే దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగకపోవడం దారుణమని వాపోతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తే ఆతని తనయుడి హయాంలో మూతకు సన్నాహాలా ? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకొని ఆమేరకు సఫలీకృతమైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే ఈ ప్రభుత్వం పయనించడం బాధాకరమని వాపోతున్నారు. మరోవైపు కార్మికుల పరిస్థితి అగమ్యగోచరం కాగా ఉద్యోగులు అనివార్యంగా వీఆర్‌ఎస్‌ తీసుకోవడం కంటే గత్యంతరం లేదన్న నిర్ణయానికి వచ్చేసి అమాత్యుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.అదలా వుంచితే..చెరకు సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది క్రమక్రమంగా తగ్గుతూ రావడం వెనుక ఎవరి కుట్రలైనా పనిచేశాయా ? అన్న సందేహాలు ఇప్పుడిప్పుడే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

అధిక దిగుబడి ఇచ్చే మేలు రకం విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ ఆమేరకు ఏనాడూ ప్రయత్నించలేదన్న వాదనలు కూడా రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఆధునిక వంగడాలను వదిలేసి పాత చింతకాయ పచ్చడి అన్నట్లు పాతరకం విత్తనాలతోనే కథ నడిపించిన నేపథ్యం అధిక దిగుబడులకు ఆస్కారమివ్వకపోగా ఇప్పుడదే చక్కెర కర్మాగారం మూసివేతకు కారణంగా అమాత్యులు చెప్పడం అన్ని వర్గాల వారిని విస్మయానికి గురి చేసినట్లయింది. ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ పరిధిలోని 80 వేల మెట్రిక్‌ టన్నుల చెరకుకు భీమసింగి షుగర్స్‌కు క్రషింగ్‌కు రప్పిద్దామన్న ఆలోచన చేయకుండా సర్కార్‌ పెద్దలు ఎంతసేపటికీ కర్మాగారాన్ని మూసేద్దామని ఆలోచించడం రైతాంగాన్ని ముంచేయడమేనని పలువురు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ, భీమసింగి షుగర్స్‌ మూసివేత ఆలోచనను విరమించి క్రషింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేయకుంటే ఉద్యమ బాట పడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. కర్మాగారంలోని ఇంటి దొంగలే రైతుల పేర్లు చెప్పి రూ.కోట్లు కాజేసిన వైనం వెనుక కూడా పెద్దలెవరైనా వున్నారా? అన్న సందేహాలు ఇప్పటికీ వుండడం ఒక ఎత్తయితే బాధ్యులపై చర్యల్లేమి ఆ సందేహాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని పరస్పరం చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement