Thursday, April 25, 2024

సుందరంగా బీచ్‌ రోడ్‌ ! ట్రాన్స్‌ లొకేషన్‌ టెక్నాలజీతో రోడ్డుకు ఇరువైపులా చెట్లు

అమరావతి, ఆంధ్రప్రభ : ఒక వైపు గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌, మరోవైపు జీ- 20 దేశాల సదస్సులు నిర్వహించబోతున్న విశాఖ నగరం నూతన శోభను సంతరించుకుంటోంది. ఈ రెండు ఈవెంట్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరం సర్వాంగ సుందరంగా, పచ్చని కప్పుతో కళకళాడిపోతోంది. మరీ ముఖ్యంగా బీచ్‌ ఫ్రంట్‌ను పచ్చగా మార్చే ప్రక్రియను జీవీఎంసీ చేపట్టి వేంగా పనులు నిర్వహిస్తోంది. నగరాన్ని పెద్దఎత్తున పచ్చదనంతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా జీవీఎంసీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో మునిసిపల్‌ ఏరియా పరిధిలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఉన్న ఏకైక నగరంగా వైజాగ్‌ వెలుగొందుతోంది. అందుకే మొదటి దశలో ట్రాన్స్‌లోకేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి సాగర్‌నగర్‌ బీచ్‌లో సుమారు 200 కొబ్బరి చెట్లను నాటారు. సాగర్‌నగర్‌ నుండి ఇస్కాన్‌ దేవాలయం వరకు ఈ చెట్లు వరుస క్రమంలో నాటారు.

దీంతో బీచ్‌ రోడ్‌ పచ్చని చెట్ల వరుసతో కళకళ్లాడుతోంది. ఒక ప్రణాళిక ప్రకారం విశాఖ బీచ్‌ రోడ్‌ నుండి భీమిలి వరకు బీచ్‌ మొత్తం కొబ్బరి చెట్లు, అందమైన మొక్కలు మరియు ఇతర జాతుల చెట్లతో నిండిఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు ప్రదేశాలలో సీఎస్‌ఆర్‌ కింద పలు రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. బహుళజాతి కంపెనీల నిధులతో భీమిలి వరకు వినోదంతో కూడిన ఎకో పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. నిధుల కోసం మున్సిపల్‌ కమిషనర్‌ రాజబాబు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, దివీస్‌ ల్యాబ్స్‌తో మాట్లాడగా, సాగర్‌నగర్‌-ఇస్కాన్‌ టెంపుల్‌ స్ట్రెచ్‌లో ఎకో పార్క్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.3 కోట్లు ఖర్చు చేసేందుకు రైల్వే సూత్రప్రాయంగా అంగీకరించిందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

హుదూద్‌కు ముందు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 44 శాతం అటవీ విస్తీర్ణం ఉండగా, కేవలం విశాఖపట్నం అర్బన్‌ జిల్లాలో 23 శాతం ఉంది. హుద్‌హుద్‌ నగరాన్ని అతలాకుతలం చేసిన తర్వాత అడవుల విస్తీర్ణం 14 శాతానికి తగ్గింది. కానీ, పీఎస్‌యూలు, స్వచ్ఛంద సంస్థలు, అటవీ శాఖల కృషి వల్ల నగరంలో ఇప్పుడు 19.5 శాతం పచ్చదనం పెరిగింది. నగరానికి 50 శాతం పచ్చదనాన్ని సాధించడమే లక్ష్యంగా అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

రూ. 100 కోట్లతో సుందరీకరణ పనులు..

ఇదిలా ఉండగా జీవీఎంసీ రూ.100 కోట్ల నిధులతో నగర సుందరీకరణను వేగవంతం చేస్తోంది. మార్చి 3, 4వ తేదీల్లో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ మరియు మార్చి 28, 29 తేదీల్లో జరిగే జీ-20 సమావేశాల సమావేశం కోసం వైజాగ్‌ రోడ్లు, పర్యాటక ప్రదేశాలు మరియు ముఖ్యమైన జంక్షన్‌లకు కార్పొరేషన్‌ ఒక రూపాన్ని కల్పిస్తోంది. ప్రతిపాదిత సుందరీకరణ పనులకోసం రూ. 75 కోట్లతో ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు. ఇదే తరహాలో ఇతర శాఖలు కూడా నగర సుందరీకరణ కోసం నిధులు కేటాయించి సుందరీకరణ పనులు చేపడుతున్నాయి. ఈ జీ20 సమావేశాల్లో దాదాపు 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొనన్నారు. ఇప్పటివరకూ అందుతున్న వివరాల ప్రకారం మొత్తం నగరంలో దాదాపు 100 కి.మీ పొడవునా రోడ్లను పునరుద్ధరించనున్నారు. సుందరీకరణ పనుల ప్రణాళికను రూపొందించేందుకు జీవీఎంసీ ఇప్పటికే ఒక కన్సల్టెంటెన్సీని కూడా నియమించింది. నగర ఏర్పాట్లను, సుందరీకరణను అధికార యంత్రాంగం నిత్యం పర్యవేక్షిస్తూ సిబ్బంకి పలు రకాల సూచనలు చేస్తోంది. దీంతో విశాఖ నగరం కొత్త సొబగులతో పర్యాటకులను, పెట్టుబడి దారులను, విదేశాల ప్రతినిధులను ఆకర్షించి ఆతిథ్యమిచ్చేందుకు సర్వన్నద్ధమౌతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement