Wednesday, May 15, 2024

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవల ద‌ర్శనం

తిరుమల, ప్రభన్యూస్‌ : కోవిడ్‌ వల్ల రెండేళ్ళుగా నాలుగు మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈనెల 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు అంగ రంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. నాలుగు మాడవీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్‌యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయ బద్దంగా ఆలయంలో కోలియ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తామని, సెప్టెంబర్‌ 26 న రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. అలాగే ఈనెల 27 న మొదటి రోజు సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు మీనలగ్నంలో ధ్వజా రోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహనం నిర్వహిస్తామని తెలిపారు.

ఇక ధ్వజా రోహణం రోజన ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అక్టోబర్‌ 5 వతేదిన తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తామని తెలిపారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టిటిడి నిర్ణయించిందని చెప్పారు. ఇక రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్‌ దర్శనాలు, వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బంది ఇతర ప్రివిలేజేషన్‌ దర్శనాలను రద్దు చేశామని తెలిపారు. అదేవిధంగా గదులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచామని చెప్పారు. తిరుమలలో గదుల లభ్యతన పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. వాహన సేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా అగరబత్తీలను భక్తులు విశేషంగా కొనుగోలు చేస్తున్నారని, పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తుల విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గోశాల అభివృద్దికి వినియోగిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవలు తిలకించి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు.

ఇక చిన్న పిల్లలకు వచ్చే అనేక వ్యాదులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు, వైద్య సేవలు అందించడం కోసం భక్తుల విరాళాలతో పద్మావతి చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి త్వరలో నిర్మాణం కానుందని తెలిపారు. ఇక తిరుమలలో అన్నప్రసాదాల తయారికి 2004 వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆంద్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపు 17 మంది దాతలు రూ. 200 కోట్లకు పైగా విలువైన కూరగాయలను విరాళంగా అందించారని , ప్రకృతి వ్యవసాయంతో కూరగాయలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఈవో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement