Monday, April 29, 2024

AP – కాంగ్రెస్ చ‌లో సెక్ర‌టేరియ‌ట్ ..ష‌ర్మిల‌తో స‌హా ప‌లువురు నేతల అరెస్ట్..

నిరుద్యోగమే లక్ష్యం
ప్రభుత్వంపై ఉద్యమాస్ర్తం
పోలీసు బలగంతో సర్కారు సిద్ధం
ఎక్కడికక్కడ నేతల గృహనిర్బంధం
పార్టీ కార్యాలయంలోనే షర్మిల మకాం
ష‌ర్మిల‌, గిడుగురాజు, మస్తాన్ వలి అరెస్టు
ఏపీలో టెన్షన్ టెన్షన్

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కదన రంగంలోకి దూకింది. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తన నూతన ఉద్యమాన్ని రాజేసింది. నిరుద్యోగుల మదిలో స్థానమే లక్ష్యంగా.. డీఎస్సీని టార్గెట్ చేసింది. చలో సెక్రటేరియట్ నినాదంతో,, ప్రభుత్వంపై తొలి బాణం సంధించింది. యథావిధిగా.. ప్రభుత్వం కూడా తన అధికారాన్ని, సత్తాను చాటుకుంది. ఆదిలోనే ఉద్యమ అణచివేతకు తన పోలీసు బలగాన్ని బరిలోకి దించింది. ఎక్కడిక్కడ కాంగ్రెస్ నాయకులపై గృహ నిర్బంధాస్ర్టం ప్రయోగించింది. అంతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గలేదు. పోలీసులు మౌనం పాటించలేదు. కాంగ్రెస్ బలగాలను పోలీసు స్టేషన్లకు తరలించారు. తమ నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని షర్మిలమ్మ డిమాండు చేశారు.

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి)
ఏపీలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్పార్టీ ఛలో సెక్రటేరియట్‌ పిలుపు మేరకు రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం రాత్రి నుంచే కాంగ్రెస్నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.. పీసీసీ చీఫ్ షర్మిల బుధవారం రాత్రే ఆంధ్రరత్న భవన్‌కు చేరుకోవడంతో.. భారీ సంఖ్యలో పోలీసులు భవన్ని చుట్టుముట్టారు. బారికేడ్లతో ఆంధ్రరత్నభవన్ నుంచి బయటకు వచ్చే రోడ్లను దిగ్బంధనం చేశారు. ఎక్కడి కక్కడ భారీగా పోలీసులు మోహరించారు. చలో సెక్రటేరియట్‌కు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఈ స్థితిని కాంగ్రెస్ పార్టీ ముందే పసిగట్టి వ్యూహం మార్చింది. బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న షర్మిల.. అకస్మాత్తుగా రూట్మార్చారు. ముందుగా నిర్ణయించుకున్నట్టు కేవీపీ ఇంటికి కాకుండా.. విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్‌కు చేరుకున్నారు. తొలుత అంపాపురంలోని కేవీపీ నివాసానికి వెళ్లాలని భావించిన షర్మిల.. పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకుని రూట్ మార్చి.. పార్టీ నేతలతో ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లారు. గురువారం ఉదయం అక్కడి నుంచే చలో సెక్రటేరియట్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే.. కాంగ్రెస్‌ ఇచ్చిన చలో సెక్రటేరియట్‌ పిలుపుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్ లు ప్రారంభించారు.

అనుమతిలేదు.. అందుకే అరెస్టులు..
చలో సెక్రటేరియట్‌కు అనుమతి లేదని తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ.. తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ఎట్టి పరిస్థితుల్లో చలో సెక్రటేరియట్‌ వెళ్లి తీరుతామని వైఎస్‌ షర్మిల భీష్మించారు. అదే సమయంలో పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది నియంత పాలన : ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల

వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారని.. ఇనుప కంచెలు వేసి బంధీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. ఇందుకు మీ చర్యలే నిదర్శనం’’ అని ఘాటుగా విమర్శించారు. గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలన్నారు. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

- Advertisement -

నిరుద్యోగమే అతిపెద్ద సమస్య..
రాష్ట్రంలో నిరుద్యోగమే అతిపెద్ద సమస్యని.2.3 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని జగన్ అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ల వరద పారిస్తామని మాట ఇచ్చారని, ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలేదు? ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని. ఉపాధి లేక 21 వేలమంది ఆత్మహత్య చేసుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తుంటే మమ్మల్ని ఎందుకు నియంత్రిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, జర్నలిస్టులకు మాట్లాడే హక్కు లేదా? ఇది భారతదేశమేనా లేదా అప్ఘనిస్థానా? కర్ఫ్యూ వాతావరణం సృష్టించి మా కార్యకర్తలను అడ్డుకున్నారు .

మేం తాలిబన్లమా..
పోలీసులను మీ బంటుల్లా వాడుకుంటారా? మేం ఏమైనా తాలిబన్లామా అని షర్మిల ప్రశ్నించారు.. ప్రజాస్వామ్యం లేదా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేం ఆందోళన చేస్తే మీకెందుకు భయం? మేం ప్రజలకు దగ్గరవుతామని మీకు భయమా? మెగా డీఎస్సీ కాకుండా.. దగా డీఎస్సీ ఇచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు వైసీసీ కార్యకర్తలకు ఇచ్చారు సరే, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలెక్కడ? అని షర్మిల ప్రశ్నించారు.

షర్మిల అరెస్టు మంగళగిరికి తరలింపు

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ సచివాలయం ముట్టడికి బయలుదేరిన ష‌ర్మిల‌ను పోలీసులుఅడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్పిలుపు మేరకు చలో సచివాలయం నిరసనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుచెప్పటమే కాదు… ఏపీలో ఎక్కడిక్కడే కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేశారు… గిడుగురాజును, మస్తాన్ వ‌లీల‌ను పోలీసులు అరెస్టు చేయటంతో…ఆంధ్రరత్న భవన్ఎదుటషర్మిల ధర్నాకు దిగారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు అధికసంఖ్యలో విజయవాడకు చేరుకోగా.. చలో సచివాలయానికి షర్మిల బయలుదేరారు. ఈ సందర్భంగా విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. అయినా చలో సచివాలయానికి షర్మిల బయలుదేరగా…తాడేపల్లిలో పోలీసులతో కాంగ్రెస్శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అక్కడ ఆమెను అరెస్టు చేసి.. మంగళగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్ఆర్ ఆత్మ క్షోబిస్తుందని, ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుందని, వైఎస్సార్ బిడ్డ పోరాటం నిరుద్యోగుల కోసమే పోరాటం చేసిందని, సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదని కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట, సీఎం రాడు..మంత్రులు లేరు..అధికారులు రారు, వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం, వీళ్లకు ఏది చేతకాదు, బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం చేతకాలేదు, ఒక అడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయం అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement