Saturday, May 4, 2024

వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో ఏపీకి 4వ స్థానం.. నివేదిక వెల్లడించిన నాబార్డు

అమరావతి, ఆంధ్రప్రభ ;వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ దేశంలో నాలుగో స్థానం సాధించింది. ఈ మేరకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) తాజా నివేదిక విడుదల చేసింది. 2020-21లో ఏపీ నుంచి వ్యవసాయోత్పత్తుల ఎగుమతి భారీగా పెరిగిందనీ, అంతకుముందు సంవత్సరం 2019-20తో పోల్చుకుంటే 20.75 శాతం మేర వృద్ధి సాధించినట్టు నాబార్డు వెల్లడించింది. వ్యయసాయోత్పత్తుల ఎగుమతిలో గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉండగా ఏపీ నాలుగోస్థానం నిలవటం ఇదే ప్రథమమని కూడా తెలిపింది. కొవిడ్‌ మహమ్మారి విసిరిన సవాళ్ళను తట్టు-కుని నిలబడ్డ రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది.. 2019-20లో రూ.2.53 లక్షల కోట్ల విలువైన వ్యవసాయోత్పత్తులను ఏపీ విదేశాలకు ఎగుమతి చేయగా.. 2020-21లో రూ.3.05 లక్షల కోట్లకు ఎగుమతులు చేరువయ్యాయి.

దీనిలో ప్రధాన వ్యవసాయోత్పత్తుల విలువ రూ 23,505 కోట్లు.. వ్యవసాయోత్పత్తుల దిగుబడులు, నాణ్యత పెంపునకు ఇది సూచిక వంటిదని నాబార్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి, నాన్‌ బాస్మతి బియ్యం వాటా 21.4 శాతంగా ఉంది. సముద్ర ఉత్పత్తులు 14.5 శాతం, గేదె మాంసం 7.7, చక్కెర 6.8 శాతంగా ఉన్నట్టు నాబార్డు తెలిపింది. దేశం నుంచి 52 శాతం ఎగుమతులు చైనా, బంగ్లాదేశ్‌, యునైట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, వియత్నాం, సౌదీ అరేబియా, ఇండోనేషియా, నేపాల్‌, ఇరాన్‌, మలేషియాతో పాటు అమెరికాకు ఎగుమతి అవుతున్నట్టు నాబార్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల నుంచే 88 శాతం వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతుండగా..మిగతా అన్ని రాష్ట్రాల వాటా కేవలం 12 శాతంగా ఉంది. దేశవ్యాపిత ఎగుమతుల్లో ఏపీ వాటా ప్రస్తుతం 6 శాతానికి చేరువవుతుండగా రానున్న అయిదేళ్లలో 10 శాతం లక్ష్యాన్ని చేరువయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement