Sunday, April 28, 2024

AP – నీళ్లు అడిగితే చంపేస్తారా.. జ‌గ‌న్ పై ప‌సుపుసేన గ‌రం గ‌రం ..

అమరావతి: తాగునీరు ప‌ట్టుకునేందుకు వ‌చ్చిన మ‌హిళ‌ను ట్రాక్ట‌ర్ తో తొక్కి చంపిన ఘ‌ట‌న‌పై జ‌న‌సేనాని, టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి దిగ్ర్బాంతి వ్య‌క్తం చేశారు.. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు.. తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ”సామినిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన కలచివేసింది. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లనే పేరుతో అడ్డుకుంటారా? నీళ్లు లేవని ప్రాధేయపడినా.. ట్రాక్టర్‌తో తొక్కించి చంపడాన్ని ఏమనాలి? ఘటనపై అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపట్టాలి. వైకాపా వాళ్లే నీరు తాగాలి.. వైకాపా వాళ్లే గాలి పీల్చాలి అనే రీతిలో భవిష్యత్తులో జీవో ఇస్తారేమో.. పంచభూతాలకు సైతం పార్టీ రంగులు పులిమే దుర్మార్గపు పాలన ఏపీలో రాజ్యమేలుతోంది. ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. అంటారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ.. నా ఎస్సీ.. అనే అర్హత ఉందా?” అని పవన్‌ ప్రశ్నించారు.

ఎపిలో ఆట‌విక రాజ్యం …

మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ”ట్యాంకర్‌ వద్దకు వచ్చిన సామినిబాయి(50)ని వైకాపా సైకో చంపేశాడు. ట్రాక్టర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీయడం కలచివేసింది. నీటి కోసం వచ్చిన మహిళను టిడిపికి చెందిన వ్యక్తివంటూ బెదిరించారు. నీటితో పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే ఆమె చేసిన నేరమా? ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. మనం ఉన్నది రాతియుగంలోనా అనే అనుమానం కలుగుతోంది. ఊరంతా చూస్తుండగానే మూడుసార్లు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. కావాలని చేసినప్పటికీ.. డ్రైవింగ్‌ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేస్తారా? పతనమైన పోలీసు వ్యవస్థకు ఇది పరాకాష్ఠ కాదా?” అని లోకేశ్‌ నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement