Monday, May 6, 2024

ఢిల్లీ పర్యటనలో ఏపీ హోంమంత్రి.. నేడు, రేపు కేంద్ర హోంశాఖ చింతన్ శిబిర్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘విజన్ 2047’ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన చింతన్ శిబిర్ (మేథోమథనం)లో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత పాల్గొననున్నారు. గురు, శుక్రవారాల్లో హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరగనున్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల హోంమంత్రులు, డీజీపీలు, హోంశాఖ ఉన్నతాధికారులను కేంద్ర హోంశాఖ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్‌తో ఆమె సమావేశమయ్యారు.

సదస్సు ఎజెండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మాట్లాడాల్సిన అంశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి అధికారులతో చర్చించారు. హోంశాఖ చింతన్ శిబిర్ సదస్సులో హోంమంత్రి తానేటి వనితతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసగించనున్నారు. “విజన్ 2047” కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటైంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన పంచప్రాణ్‌లో భాగంగా కేంద్ర హోంశాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. హోంశాఖ సదస్సులో సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్ కోసం తగిన వ్యవస్థను అభివృద్ధి చేయడం, పోలీసు బలగాల ఆధునీకరణ, నేర న్యాయ వ్యవస్థలో ఐటీ వినియోగం పెరగడం, సరిహద్దు నిర్వహణ, తీరప్రాంత భద్రత మరియు అంతర్గత భద్రతకు సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. పోలీసింగ్‌లో అనేకాంశాల్లో దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా నిలుస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసు యంత్రాగం ఈ సదస్సులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది.

ముఖ్యంగా అంతర్గత భద్రతలో భాగమైన వామపక్ష తీవ్రవాదం (మావోయిస్టులు) సమస్యను ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, గ్రేహౌండ్స్ వంటి సుశిక్షిత బలగాల విషయంలో గత కొన్నేళ్ల నుంచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. జాతీయస్థాయి సదస్సుల్లో తమ తమ రాష్ట్రాల్లో చేపట్టిన అనేక చర్యల గురించి వివరించాయి. అలాగే సైబర్ నేరాలను ఎదుర్కొనే విషయంలోనూ తెలుగు రాష్ట్రాల పోలీసులు ముందంజలో ఉన్నారు. వీటిపై ప్రజంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement